ఈతరం భారతం చెన్నై జూలై 12:
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆ రాష్ట్రంలో ఇండియా కూటమిలో విభేదాలు బహిర్గతం అయ్యాయి. మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే.. ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీని జాతీయ స్థాయిలో ఇండియా కూటమిలో చేర్చాలన్న ప్రతిపాదనను డీఎంకే స్పష్టంగా తిరస్కరించింది. బీజేపీకి వ్యతిరేకంగా రాష్ట్ర రాజకీయాలు వేరు.. జాతీయ రాజకీయాలు వేరు అనే విధానాన్ని అనుసరించాలని వీసీకే పార్టీ అధ్యక్షుడు థోల్ తిరుమావళవన్ సూచించగా.. ఆ ప్రతిపాదనకు కాంగ్రెస్ కూడా మద్దతు తెలిపింది.అయితే.. వీసీకే, కాంగ్రెస్ చేసిన ఈ ప్రతిపాదనను డీఎంకే తీవ్రంగా ఖండించింది. ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల తర్వాత.. ప్రభుత్వ ఏర్పాటు సమయంలో తమతో ఉన్న పొత్తును కాంగ్రెస్ పార్టీ విరమించుకుని టీవీకే ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిందని.. ఇది రాజకీయ ద్రోహం అని డీఎంకే తీవ్ర ఆరోపణలు చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో కేరళ, పశ్చిమ బెంగాల్ లాగా తమిళనాడులో డీఎంకే పనిచేయదని.. ఆ పార్టీ ఎంపీ గణపతి పి. రాజ్‌కుమార్ తేల్చి చెప్పారు. ఈ క్రమంలోనే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ.. వీకేసీ పార్టీని మధ్యవర్తిగా ఉపయోగించి మళ్లీ తమను ఒప్పించే ప్రయత్నం చేస్తోందని విమర్శలు గుప్పించారు.















