ఈతరం భారతం న్యూఢిల్లీ జూలై 12
జాతీయ గీతం జనగణమన, జాతీయ గేయం వందేమాతరం ఆలపించే విధానంపై కేంద్ర హోంశాఖ తాజాగా అత్యంత కీలకమైన మార్గదర్శకాలను విడుదల చేసింది. దేశంలోని పలు రాష్ట్రాల్లో అధికారికంగా ప్రత్యేక రాష్ట్ర గీతాలు ఉన్నప్పటికీ.. జాతీయ ప్రాధాన్యత కలిగిన వందేమాతరం, జనగణమనలకే ప్రథమ స్థానం ఇవ్వాలని కేంద్రం స్పష్టం చేసింది. ఇటీవల తమిళనాడులో నూతన ప్రభుత్వ ప్రమాణస్వీకార మహోత్సవం సందర్భంగా జాతీయ గేయం, జాతీయ గీతాల ఆలపన అనంతరం.. తమిళ రాష్ట్ర గీతాన్ని చివర్లో పాడటంపై పెద్ద ఎత్తున రాజకీయ వివాదం చెలరేగింది. ఈ వివాదానికి శాశ్వత పరిష్కారం చూపుతూ కేంద్ర హోంశాఖ తాజాగా ఆదేశాలను జారీ చేసింది.కేంద్ర హోంశాఖ విడుదల చేసిన తాజా ఉత్తర్వుల ప్రకారం.. ఏ రాష్ట్రంలోనైనా అధికారిక కార్యక్రమాల్లో జాతీయ గీతం, జాతీయ గేయంతో పాటు ఆయా రాష్ట్ర గీతాన్ని కూడా ఆలపించే ఆనవాయితీ లేదా సంప్రదాయం ఉంటే.. కొన్ని కచ్చితమైన నియమాలను పాటించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. అధికారిక కార్యక్రమం ప్రారంభంలో లేదా ప్రోటోకాల్ ప్రకారం ముందుగా వందేమాతరం, ఆ తర్వాత జనగణమనలను పూర్తిగా ఆలపించాలి. ఈ రెండు పాడడం పూర్తయ్యాక మాత్రమే ఆయా రాష్ట్రాలకు సంబంధించిన అధికారిక రాష్ట్ర గీతాన్ని పాడాల్సి ఉంటుంది. జాతీయ గౌరవాన్ని కాపాడేందుకే ఈ ప్రాధాన్యత క్రమాన్ని నిర్దేశించినట్లు కేంద్రం పేర్కొంది.ప్రభుత్వ, అధికారిక కార్యక్రమాల్లో జాతీయ గేయమైన వందేమాతరాన్ని ఆలపించేటప్పుడు నిడివి, పదాల వినియోగంపై కేంద్రం కఠిన నిబంధనలను విధించింది. అధికారిక రూపంలో ఉన్న వందేమాతరం గేయం మొత్తం ఆరు చరణాలను కలిగి ఉంటుంది. ఈ పూర్తి గేయాన్ని ఆలపించడానికి 3 నిమిషాల 10 సెకన్ల సమయం పడుతుందని కేంద్రం స్పష్టం చేసింది. ఈ సమయ పరిమితిని, రాగాన్ని కచ్చితంగా పాటించాలని ఆదేశించింది.
వందేమాతరం ఆలపించే సమయంలో ఎలాంటి చిన్న తప్పులు దొర్లకుండా అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని కేంద్ర హోంశాఖ రాష్ట్రాలను, అధికారులను హెచ్చరించింది. అలాగే జాతీయ గేయానికి సంబంధించి కేంద్రం ఆమోదించిన అధికారిక లిపిని, అందులోని పద వినియోగాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చకూడదని చెప్పింది. రాష్ట్ర భాషలు లేదా ఉచ్చారణల సాకుతో జాతీయ గేయ ముద్రను, మూల పదాలను సవరించడానికి వీళ్లేదని స్పష్టం చేసింది. అలాగే రాజ్యాంగబద్ధమైన అధికారిక కార్యక్రమాల్లో ఈ మార్గదర్శకాలను ఉల్లంఘిస్తే తీవ్రంగా పరిగణిస్తామని కేంద్రం వివరించింది















