EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

సాంకేతికతలో పోలీసులే ముందుండాలి: ఈ-జీరో ఎఫ్‌ఐఆర్ అమలు మరింత వేగవంతం చేయాలి..

ఈతరం భారతం హైదరాబాద్ జూలై 24

పెరుగుతున్న సైబర్ నేరాలను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే తెలంగాణ పోలీసులు సాంకేతికతలో ఎప్పటికప్పుడు ముందుండాలని రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) సీవీ ఆనంద్ అన్నారు.

కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన అన్ని సైబర్ భద్రత ప్రమాణాల్లో తెలంగాణ అత్యుత్తమ పనితీరు కనబరిచి జాతీయ స్థాయిలో అగ్రస్థానాన్ని సాధించేలా అన్ని పోలీసు యూనిట్లు కృషి చేయాలని ఆయన ఆదేశించారు. శుక్రవారం రాష్ట్రంలోని అన్ని పోలీసు యూనిట్ల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన డీజీపీ, సైబర్ సెక్యూరిటీ, ఈ-జీరో ఎఫ్‌ఐఆర్ , క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్‌వర్క్ అండ్ సిస్టమ్స్ అమలుపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ, ప్రధానమంత్రి ప్రగతి వేదిక ద్వారా దేశవ్యాప్తంగా కీలక ప్రాజెక్టులు, పాలనకు సంబంధించిన కార్యక్రమాల పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. దేశంలో రోజురోజుకు పెరుగుతున్న సైబర్ మోసాలు, ముఖ్యంగా “డిజిటల్ అరెస్ట్” పేరుతో జరుగుతున్న మోసాలపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోందన్నారు. కేంద్ర హోంశాఖ పరిధిలోని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C) రాష్ట్రాల సైబర్ భద్రత పనితీరును క్రమం తప్పకుండా సమీక్షిస్తోందని డీజీపీ తెలిపారు. మొత్తం తొమ్మిది కీలక పనితీరు సూచికల (KPIs) ఆధారంగా రాష్ట్రాలకు జాతీయ ర్యాంకులు కేటాయిస్తారని, ఆ అన్ని అంశాల్లో తెలంగాణ పోలీసులు మరింత సమర్థవంతంగా పనిచేసి జాతీయ స్థాయిలో అగ్రస్థానాన్ని సాధించాలని సూచించారు.రాష్ట్రంలో ఈ-జీరో ఎఫ్‌ఐఆర్ వ్యవస్థ అమలు ఇంకా పూర్తిస్థాయిలో జరగాల్సి ఉందని డీజీపీ పేర్కొన్నారు. ప్రతి యూనిట్ ఈ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం తెలంగాణ జాతీయ స్థాయిలో వివిధ విభాగాల్లో కొంత వెనుకపడ్డామన్నారు. ఇకపై అన్ని విభాగాల్లో రాష్ట్ర పనితీరును మరింత మెరుగుపరచాలని డీజీపీ అధికారులను ఆదేశించారు. సైబర్ నేరాల నియంత్రణలో ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని పేర్కొన్న డీజీపీ, కెపాసిటీ బిల్డింగ్ కార్యక్రమాలతో పాటు ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్ అండ్ కమ్యూనికేషన్ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించి ప్రజల్లో సైబర్ భద్రతపై అవగాహన పెంపొందించాలని సూచించారు. సాంకేతిక ఆధారిత దర్యాప్తు విధానాలపై ప్రత్యేక దృష్టి సారించాలని డీజీపీ పేర్కొన్నారు. సైబర్ నేరాల దర్యాప్తుతో పాటు సాధారణ పోలీసింగ్‌లో కూడా క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్‌వర్క్ అండ్ సిస్టమ్స్ ను పూర్తిస్థాయిలో వినియోగించి దర్యాప్తు నాణ్యతను మెరుగుపరచాలని అధికారులకు సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయెల్, టీ-స్పార్క్ ఎస్పీ రూపేష్, సైబర్ సెక్యూరిటీ ఎస్పీ సాయి శ్రీ తో పాటు రాష్ట్రంలోని వివిధ పోలీసు యూనిట్ల సీనియర్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top