EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

కేసు విచార‌ణ వీడియోల షేరింగ్‌పై సుప్రీంకోర్టు ఆగ్ర‌హం.. మెటా, ఎక్స్‌ల‌కు నోటీసులు

ఈతరంభారతం న్యూఢిల్లీ జులై 24

కోర్టు విచార‌ణ‌కు సంబంధించిన వీడియోలు ఇటీవ‌లి కాలంలో సోష‌ల్ మీడియాలో షేర్ అవుతున్నాయి. దీంతో ఈ అంశంపై సుప్రీంకోర్టు స్పందించింది. అనుమ‌తి లేకుండా అలాంటి వీడియోల‌ను షేర్ చేయొద్ద‌ని ఆదేశించింది. కోర్టు విచార‌ణ‌ల రికార్డెడ్ వీడియోలు, లైవ్ స్ట్రీమింగ్ వీడియోల ప్ర‌సారాలు, షేరింగ్‌కు సంబంధించి మార్గ‌ద‌ర్శ‌కాల విష‌యంపై సుప్రీంకోర్టులో పిల్ దాఖ‌లైంది. దీనిపై సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ సూర్య‌కాంత్, జ‌స్టిస్ జోయ్‌మాల్యా బాగ్చి, జ‌స్టిస్ వి.మోహ‌న ఆధ్వ‌ర్యంలోని బెంచ్ శుక్ర‌వారం విచార‌ణ జ‌రిపింది.

ఈ సంద‌ర్భంగా సోష‌ల్ మీడియా సంస్థ‌లైన మెటా, ఎక్స్‌ల‌తోపాటు కేంద్ర ప్ర‌భుత్వానికి కూడా నోటీసులు జారీ చేసింది. కోర్టు విచార‌ణ‌కు సంబంధించిన ఆడియో, వీడియో రికార్డింగ్స్, లైవ్ స్ట్రీమింగ్ వీడియోలు అప్‌లోడ్, రీపోస్టులు, ఎడిటెడ్ వీడియోలు, మానిటైజ్డ్ కంటెంట్ ఏదైనా స‌రే.. సోష‌ల్ మీడియాలో లేదా ఇత‌ర డిజిట‌ల్ ప్లాట్‌ఫామ్‌ల‌పై అనుమ‌తి లేకుండా ప్ర‌సారం చేయ‌కూడ‌ద‌ని కోర్టు ఆదేశించింది. ఈ మేర‌కు మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులు జారీ చేసింది. హైకోర్టుల‌కు సంబంధించి రిజిష్ట‌ర్ జ‌న‌ర‌ల్ వ‌ద్ద‌, సుప్రీంకోర్టుల‌కు సంబంధించి సెక్రెట‌రీ జ‌న‌ర‌ల్ వ‌ద్ద అనుమ‌తులు తీసుకున్న త‌ర్వాత‌నే వాటిని ప్ర‌సారం చేయాల‌ని కోర్టు ఆదేశించింది. అలాగే, రికార్డింగ్‌ల‌ను ఎడిట్ చేయ‌కూడ‌ద‌ని, సెలెక్టివ్‌గా స‌ర్క్యులేట్ చేయ‌కూడ‌ద‌ని, మానిటైజ్ కూడా చేయ‌కూడ‌ద‌ని డిజిట‌ల్ ప్లాట్‌ఫాంల‌ను ఆదేశించింది.అయితే, ఆయా విచార‌ణ‌ల‌కు సంబంధించి వార్తా ప్ర‌సారాల‌పై లేదా స‌మాచారం చేర‌వేత‌పై ఎలాంటి ఆంక్ష‌లు లేవ‌ని తెలిపింది. భావ‌ప్ర‌క‌ట‌నా స్వేచ్ఛ కింద మీడియాలో ప్ర‌చురించ‌వ‌చ్చ‌ని తెలిపింది. ఇదే స‌మ‌యంలో కోర్టులేమీ ఇర‌వై నాలుగ్గంట‌ల వినోద ఛానెల్స్ కావ‌ని కోర్టు అభిప్రాయ‌పడింది. కోర్టు ప్రొసీడింగ్స్‌కు సంబంధించి ఇప్ప‌టికే సోష‌ల్ మీడియాలో, ఆన్‌లైన్‌లో వైర‌ల్ అవుతున్న కొన్ని వీడియోలు కోర్టుల గౌర‌వాన్ని త‌గ్గించేలా ఉన్నాయ‌నే ఉద్దేశంతో ఈ పిల్ దాఖ‌లైంది.

Related News

Select the Topic
Scroll to Top