ఈతరం భారతం వనపర్తి జులై 26 ;
వనపర్తి జిల్లా DBCDOను తక్షణమే సస్పెండ్ చేసి, సమగ్ర శాఖాపరమైన విచారణతో పాటు క్రిమినల్ విచారణ జరపాలి – ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కె. పవన్ కుమార్ డిమాండ్ చేశారు.
వనపర్తి జిల్లా బీసీ సంక్షేమ శాఖ పరిధిలోని ప్రభుత్వ బీసీ కళాశాల వసతి గృహాల్లో వరుసగా చోటుచేసుకుంటున్న విద్యార్థుల మరణాలు, ఫుడ్ పాయిజన్ ఘటనలు, విద్యార్థుల భద్రతలో లోపాలు, హాస్టళ్ల నిర్వహణలో తీవ్రమైన అవకతవకలు అత్యంత ఆందోళనకరమైన విషయం. గత సంవత్సరం (2025 నవంబర్) కొత్తకోట ప్రభుత్వ బీసీ కళాశాల బాలుర వసతి గృహానికి చెందిన ఆత్మకూరు విద్యార్థి నందు హాస్టల్ పర్యవేక్షణలో లోపాల కారణంగా బయటకు వెళ్లి రోడ్డు ప్రమాదంలో మరణించిన ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరపాలి.అలాగే కొత్తకోట ప్రభుత్వ బీసీ కళాశాల బాలికల వసతి గృహంలో 31 మంది విద్యార్థినులు ఫుడ్ పాయిజన్‌కు గురై ఆసుపత్రిలో చేరిన ఘటనపై బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. అలాంటి ఘటనల అనంతరం సంబంధిత అధికారులను తాత్కాలికంగా సస్పెండ్ చేసి, తిరిగి అదే హాస్టల్లో పోస్టింగ్ ఇవ్వడం ప్రభుత్వ పరిపాలనపై అనుమానాలకు తావిస్తోంది. ఈ నిర్ణయాలు ఏ నిబంధనల ప్రకారం తీసుకున్నారో ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు.వనపర్తి ప్రభుత్వ బీసీ కళాశాల బాలికల వసతి గృహంలో ఒక విద్యార్థిని అదృశ్యమైన ఘటనలో, పోలీసు స్టేషన్లో FIR నమోదు అయ్యే వరకు సంబంధిత అధికారులు శాఖకు, జిల్లా కలెక్టర్‌కు సమాచారం ఇవ్వలేదనే ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలి. వాస్తవాలు నిర్ధారణ అయితే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.
అలాగే ఒక హాస్టల్ వార్డెన్ గత అనేక సంవత్సరాలుగా అదే జిల్లాలో కొనసాగుతూ, బదిలీ అనంతరం తిరిగి డిప్యూటేషన్‌పై వచ్చిన విధానం, విద్యార్థుల హాజరు, ఆహార సరఫరా, నిధుల వినియోగంపై వచ్చిన ఆరోపణలను స్వతంత్రంగా విచారించాలి.వనపర్తి ప్రభుత్వ బీసీ కళాశాల బాలుర వసతి గృహంలో హాస్టల్ నిర్వహణను ప్రైవేట్ వ్యక్తులు నిర్వహిస్తున్నారనే ఆరోపణలు, ప్రవేశాల పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారనే ఫిర్యాదులు కూడా అత్యంత తీవ్రమైనవి. ఈ అంశాలపై జిల్లా స్థాయి లేదా విజిలెన్స్ విచారణ జరిపి వాస్తవాలను బయటపెట్టాలి.
ఇటీవల (ఈ నెల 25వ తేదీన) ఆత్మకూరుకు చెందిన డిగ్రీ విద్యార్థి హాస్టల్ వార్డెన్ అందుబాటులో లేకపోవడంతో బయటకు వెళ్లి కాలువలో పడి మరణించిన ఘటనపై కూడా పూర్తి స్థాయి మేజిస్ట్రియల్ విచారణ నిర్వహించి బాధ్యులను గుర్తించాలన్నారు.ఈ అన్ని ఘటనల నేపథ్యంలో జిల్లా బీసీ అభివృద్ధి అధికారి (DBCDO) తన పర్యవేక్షణ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించారా అనే అంశంపై శాఖాపరమైన విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.
DBCDO పర్యవేక్షణలో జరిగినట్లు ఆరోపణలు ఉన్న ప్రధాన లోపాలు:
బీసీ హాస్టళ్లపై క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించకపోవడం
విద్యార్థుల హాజరు, ప్రవేశాల ధృవీకరణలో నిర్లక్ష్యం.
ఆహార నాణ్యత, పరిమాణాన్ని పర్యవేక్షించడంలో వైఫల్యం.
ప్రభుత్వ నిధుల వినియోగంపై సమీక్ష లేకపోవడం.
స్టాక్ రిజిస్టర్లు, క్యాష్ బుక్స్, బిల్లులు, వౌచర్లను పరిశీలించకపోవడం- నకిలీ బిల్లులు, డూప్లికేట్ క్లెయిమ్‌లు వంటి ఆరోపణలను గుర్తించి చర్యలు తీసుకోకపోవడం- నిబంధనలు ఉల్లంఘించిన అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోకపోవడం.
ప్రభుత్వ ఉత్తర్వులు (GOs), శాఖ మార్గదర్శకాల అమలును పర్యవేక్షించడంలో విఫలం కావడం.
తనిఖీ నివేదికలను ఉన్నతాధికారులకు సమయానికి సమర్పించకపోవడం.
పర్యవేక్షణలో నిర్లక్ష్యం వల్ల విద్యార్థుల భద్రత, సంక్షేమం దెబ్బతినడం మరియు ప్రభుత్వానికి ఆర్థిక నష్టం కలిగే పరిస్థితులు ఏర్పడినట్లు వచ్చిన ఆరోపణలు.
PDSU డిమాండ్లు:
1 వనపర్తి జిల్లా DBCDOను విచారణ పూర్తయ్యే వరకు తక్షణమే సస్పెండ్ చేయాలి.2. సంబంధిత హాస్టల్ వార్డెన్లపై శాఖాపరమైన మరియు అవసరమైతే క్రిమినల్ విచారణ చేపట్టాలి.3. విద్యార్థుల మరణాలు, ఫుడ్ పాయిజన్, మిస్సింగ్ ఘటనలపై న్యాయపరమైన లేదా మేజిస్ట్రియల్ విచారణ జరపాలి.4. బీసీ సంక్షేమ శాఖ రాష్ట్రస్థాయి ప్రత్యేక బృందంతో అన్ని హాస్టళ్లపై సమగ్ర తనిఖీలు నిర్వహించాలి.5. బాధ్యులపై సేవా నియమావళి మరియు వర్తించే చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలి.6. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రతి హాస్టల్లో బాధ్యతాయుతమైన పర్యవేక్షణ వ్యవస్థను అమలు చేయాలి.















