ఈతరం భారతం తిరుపతి, సెప్టెంబర్ 05 రిపోర్టర్ మనోజ్ కుమార్
___________________________________________________
నగరంలోని పార్కులను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎం.జయకృష్ణ అధికారులను ఆదేశించారు. శనివారం నగరంలోని పలు ప్రాంతాల్లో ఆయన పర్యటించి పారిశుధ్యం, ప్రజా సౌకర్యాలను పరిశీలించారు. పద్మావతి పార్కును పరిశీలించిన సందర్భంగా అక్కడి వాకర్స్ పార్కులోని జిమ్ పరికరాలు పాడైపోయాయని, కలుపు మొక్కలు అధికంగా పెరిగిపోయాయని కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కమిషనర్ వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు.
పద్మావతి పార్కు చుట్టూ ఫుట్‌పాత్‌పై తోపుడు బండ్లు ఏర్పాటు చేయడంతో నడిచే వారికి ఇబ్బందులు కలుగుతున్నాయని స్థానికులు కమిషనర్‌కు వివరించారు. ఫుట్‌పాత్‌లపై ప్రజలు సౌకర్యవంతంగా నడిచేలా సమస్యను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఎంజీఎం స్కూల్ పరిసరాల్లో పారిశుధ్య పరిస్థితులను పరిశీలించిన కమిషనర్ శానిటేషన్ సక్రమంగా లేకపోవడంపై సిబ్బందిని మందలించారు. అనంతరం రాయల్ నగర్‌లోని వాటర్ ట్యాంక్‌ను పరిశీలించి నీటి లీకేజీని వెంటనే అరికట్టాలని సిబ్బందికి సూచించారు.
తాతయ్యగుంట గంగమ్మ ఆలయం, రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లోనూ పారిశుధ్య పరిస్థితులను పరిశీలించారు. అనంతరం ఈఎస్ఐ ఆసుపత్రి సమీపంలోని అన్న క్యాంటీన్‌ను తనిఖీ చేశారు. క్యాంటీన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు ప్రజలకు నాణ్యమైన భోజనం అందించాలని సిబ్బందికి సూచించారు. కమిషనర్ వెంట శానిటేషన్ సూపర్వైజర్ చెంచయ్యతో పాటు సిబ్బంది పాల్గొన్నారు.















