EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

విద్యారంగాన్ని ధ్వంసం చేసిన సీఎం రేవంత్ రెడ్డి : తక్షణమే విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేయాలి

ఈతరం భారతం హైద్రాబాద్ జులై 27;

కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, నెరవేర్చని హామీల నుంచి ప్రజల మరియు జెన్-జీ (Gen-Z) యువత దృష్టిని మళ్లించడానికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల్లో పోటీ చేసే కనీస వయస్సును 25 నుండి 21 ఏళ్లకు తగ్గించాలనే కొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చారని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఎన్. రాంచందర్ రావు విమర్శించారు. రాజ్యాంగ నిర్మాతలు, ముఖ్యంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారు శాసనసభ్యుడికి అనుభవం అవసరమనే దూరదృష్టితోనే 25 ఏళ్ల వయస్సును నిర్ణయించారని, ఇప్పుడు సీఎం చేస్తున్నది కేవలం మభ్యపెట్టే రాజకీయం (డైవర్షన్ పాలిటిక్స్) మాత్రమేనని స్పష్టం చేశారు. ఈ రోజు బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాంచందర్ రావు మాట్లాడారు. ఈ సందర్భంగా.. కాంగ్రెస్ పార్టీకి నిజంగా యువతకు అవకాశాలు ఇవ్వాలనే చిత్తశుద్ధి ఉంటే, ముందుగా కాంగ్రెస్ జాతీయ అధ్యక్ష పదవి నుండి మల్లికార్జున్ ఖర్గేని తప్పించి, ఆ బాధ్యతలను ఏదేని యువ నాయకుడికి అప్పగించాలని సవాల్ విసిరారు. తమ బీజేపీ ఇప్పటికే శ్రీ నితిన్ నబిన్ గారిని జాతీయ అధ్యక్షుడిగా నియమించి యువతకు తగిన ప్రాధాన్యం ఇచ్చిందని గుర్తుచేశారు.

మరోవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడిచినా విద్యార్థులు, యువతకు ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని విమర్శించారు రాష్ట్రంలో సుమారు 20 లక్షల మంది విద్యార్థులకు చెల్లించాల్సిన రూ.12,000 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయకపోవడంతో విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లు కళాశాలల్లోనే నిలిచిపోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన గుర్తచేశారు. అదేవిధంగా తెలంగాణలోని 17 ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు నిధుల కొరత (Fund Crunch), అధ్యాపకుల కొరత (Faculty Crunch)తో తీవ్ర సంక్షోభంలో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. యూనివర్సిటీలకు రూ.1,000 కోట్లు ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటివరకు రూపాయి కూడా విడుదల చేయలేదు. ఉపాధ్యాయులకు జీతాలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేక విద్యా వ్యవస్థ కుదేలైందని రాంచందర్ రావు గారు మండిపడ్డారు.

ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ.. యువతకు 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, నెలకు రూ.4,000 నిరుద్యోగ భృతి, విద్యాభరోసా కార్డులు, విద్యార్థినులకు ఉచిత స్కూటర్లు, ప్రైవేట్ ఉద్యోగాల్లో 75% స్థానికులకు రిజర్వేషన్లు, యూత్ కమిషన్, ఎంప్లాయిమెంట్ సపోర్ట్ సిస్టమ్ వంటి ప్రతి హామీ గాలిలో కలిసిపోయిందని విమర్శించారు. విద్యాశాఖను యువ నాయకుడికి అప్పగిస్తామని చెప్పిన కాంగ్రెస్ ఆ మాటను కూడా నిలబెట్టుకోలేదని, విద్యాశాఖలో పూర్తిగా విఫలమైన సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రిగా నైతిక బాధ్యత వహించి తక్షణమే రాజీనామా చేయాలని రాంచందర్ రావు గారు డిమాండ్ చేశారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే విద్యాశాఖ బాధ్యతలను కాంగ్రెస్ యువ ఎమ్మెల్యే శ్రీమతి యశస్వినీ రెడ్డి గారికి అప్పగించి నిరూపించుకోవాలని సూచించారు. దేశవ్యాప్తంగా యువత ప్రధాని మోదీ గారి నాయకత్వంలోని బీజేపీ పైనే విశ్వాసం ఉంచారని, అందుకే బీజేపీ అతిపెద్ద రాజకీయ శక్తిగా నిలిచిందని పేర్కొన్నారు.

మాజీ రాష్ట్రపతి, ‘మిస్సైల్ మ్యాన్’ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి వర్ధంతి సందర్భంగా రాష్ట్ర బీజేపీ తరఫున ఎన్. రాంచందర్ రావు గారు ఘనంగా నివాళులర్పించారు. యువత, విద్యార్థుల అభ్యున్నతే కలాం గారి జీవిత లక్ష్యమని, ఆయన ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వం విద్యా వ్యవస్థపై దృష్టి సారించి విద్యార్థుల సంక్షేమానికి కృషి చేయాలని రాంచందర్ రావు గారు కోరారు.

శ్రీమన్ భగవద్గీత పుస్తకావిష్కరణ:

ఇదే మీడియా సమావేశంలో జేఎన్‌టీయూ (JNTU)లో జరిగిన పరిశోధన ఆధారంగా, ప్రొఫెసర్ మల్లికార్జున్, సుజాత గారు సంయుక్తంగా రచించిన ‘శ్రీమన్ భగవద్గీత’ పుస్తకాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఎన్. రాంచందర్ రావు గారు ఆవిష్కరించారు. ఈ పుస్తకం కార్పొరేట్ రంగంలోని ఉద్యోగులు, యువతకు ఎంతగానో ఉపయోగపడుతుందని, ఆత్మశాంతి (Inner Peace), స్థితప్రజ్ఞత (Stable Mind), ఏకాగ్రత (Focus), సత్వగుణం (Mode of Goodness), శరణాగతి (Surrender) వంటి అంశాలను భగవద్గీత దృక్పథంలో సమగ్రంగా వివరించారని కొనియాడారు. ప్రతి ఒక్కరూ ఈ పుస్తకాన్ని చదివి అందులోని మానవీయ విలువలను ఆచరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే  పాయల్ శంకర్, రాష్ట్ర కార్యదర్శి  కొప్పు భాష, ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు రవి నాయక్, మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు  జగ్మోహన్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top