ఈతరం భారతం హైదరాబాద్ ఆగస్ట్ 13
నిత్య జనగణమన కేంద్రంలో పంద్రాగస్టు వేడుకలకు గురువారం శ్రీకారం చుట్టారు. మొదటిరోజు ఉత్సవాల్లో భాగంగా ఇటీవలే ప్రపంచ గిన్నిస్ రికార్డు సాధించిన నల్లకుంట పద్మ కాలనీలోని ఓమా టైక్వాండో అకాడమీకి చెందిన 50 మందికి పైగా (5- 14 సంవత్సరాల వయస్సు) టైక్వాండో ట్రైనీస్ తో సహా నేటి పతాకావిష్కరణ కార్యక్రమానికి ర్యాలీగా విచ్చేశారు. వారి శిక్షణ కేంద్రమైన పద్మ కాలనీ నుంచి టైక్వాండో శిక్షకులు, శిక్షణార్థులు జెండా కేంద్రం వరకు పతాక ప్రదర్శన (Rally) చేశారు. ఓమా అకాడమీ డైరెక్టర్ పచ్చి పులుసు ఆంజనేయులు, కోచ్ గౌరీ శంకర్, శిక్షకులు సత్యప్రసాద్, సుధాకర్ ర్యాలీకి సారథ్యం వహించారు. కాగా, నిత్య జనగణమన నిర్వాహక సంస్థ వందే ప్రజ ప్రతినిధులు ఎం.కే. శ్రీనివాస్, బట్టు రమాదేవి ర్యాలీని తోడుకొని వచ్చారు. జిల్లా కేంద్రం వద్ద ప్రదర్శకులకు.. ర్యాలీకి నిత్య జనగణమన ఫౌండింగ్ ఆర్గనైజర్ నేలంటి మధు స్వాగతం పలికారు.ర్యాలీ చేస్తున్న విద్యార్థులు.., టైక్వాండో ట్రైనీస్ ప్రదర్శన ఆద్యంతం దేశభక్తి, జాతీయపతాక, సార్వభౌమత్వ నినాదాలు చేశారు. ఈ నినాదాలు పద్మ కాలనీ నుంచి జెండా కేంద్రం వరకు దిక్కులను పిక్కటిల్ల జేశాయి. ఈ జెండా ర్యాలీని దారి పొడవునా ప్రజలు ఆసక్తిగా గమనించారు. బాటసారులు, దుకాణదారులు స్పందనగా జెండాకు వందనం చేయడం విశేషం.జెండా కేంద్రం వద్ద ఎంకే శ్రీనివాస్ వందేమాతర గీతం ఆలపించారు. తరువాత కోచ్ గౌరీ శంకర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం అందరూ కలిసి జాతీయ గీతం జనగణమన ను కోరస్ గా ఆలపించారు.
ఈ విధంగా వందే ప్రజా నిర్వహిస్తున్న పంద్రాగస్టు వేడుకల్లో తొలి రోజు కార్యక్రమం ప్రజల కరతాళ ధ్వనుల మధ్య విజయవంతంగా కొనసాగింది.















