ఈతరంభారతం హైదరాబాద్ ఆగస్ట్ 12
హైదరాబాద్ లోని ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ కేంద్రంలో పౌరసరఫరాల శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించిన సమీక్షా సమావేశంలో రైస్ మిల్లర్ల బకాయిల వసూలుపై కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వానికి రావాల్సిన బకాయిలను వెంటనే రాబట్టాలని అధికారులను స్పష్టం చేశారు. మిల్లర్లు ఎటువంటి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడినా ఉపేక్షించేది లేదని ఆయన గట్టిగా తేల్చిచెప్పారు. ప్రభుత్వ ధాన్యాన్ని సకాలంలో మిల్లింగ్ చేయని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.ఉద్దేశపూర్వకంగా బకాయిలు చెల్లించకుండా డిఫాల్ట్ అయిన రైస్ మిల్లులను ప్రభుత్వ స్వాధీనం చేసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆ మిల్లుల నిర్వహణ బాధ్యతలను మహిళా సంఘాలకు అప్పగించే దిశగా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. దీనివల్ల మహిళలకు ఆర్థికంగా మంచి అవకాశం లభిస్తుందని తెలిపారు. ఈ అంశంపై కేబినెట్ సబ్ కమిటీలో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన వెల్లడించారు.
ధాన్యం నిల్వ కోసం మార్కెట్లో ఉన్న గోడౌన్లను పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఐదు నియోజకవర్గాల్లో మహిళా సంఘాల ఆధ్వర్యంలో భారీ గోడౌన్ల నిర్మాణానికి పైలట్ ప్రాజెక్ట్ చేపట్టాలని తెలిపారు. ఉపాధి హామీ పథకం నిధులను దీనికోసం వినియోగించేలా చూడాలని సూచించారు. ప్రతి జిల్లాకు ఒక నోడల్ అధికారిని నియమించి పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని స్పష్టం చేశారు.















