ఈతరం భారతం న్యూఢిల్లీ ఆగస్టు 15 శనివారం
పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు.. ఉచితంగా ఆన్లైన్ కోచింగ్ అందించనున్నట్లు ప్రధాని మోడీ తెలిపారు. డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు ప్రతిభావంతులైన ఉపాధ్యాయులు, విద్యావేత్తల సేవలను ఉపయోగించుకోనున్నట్లు వెల్లడించారు. యువత తమ కుటుంబాలకు దూరంగా వెళ్లకుండా నాణ్యమైన కోచింగ్ పొందే అవకాశం కల్పించడమే లక్ష్యమన్నారు. ఇక జనగణనలో యువత భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చిన మోదీ.. దేశంలో మావోయిస్టు హింస, నక్సలిజంపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు.
భారతదేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట వేదికగా ప్రసంగించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. దేశ యువతకు కీలక ప్రకటన చేశారు. దేశంలో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థుల కోసం ఉచిత ఆన్లైన్ కోచింగ్ అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు ప్రకటించారు. కోచింగ్ సెంటర్లకు వెళ్లేందుకు మధ్యతరగతి, పేద కుటుంబాలు భారీగా ఖర్చు చేయాల్సి వస్తోందని పేర్కొన్న ప్రధాని మోదీ.. వారిపై ఆర్థిక భారం తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.పోటీ పరీక్షల కోచింగ్ విషయంలో విద్యార్థులు, వారి కుటుంబాలపై పెరుగుతున్న ఆర్థిక ఒత్తిడిని ప్రధాని మోదీ ప్రస్తావించారు. తమ పిల్లలను కోచింగ్ సెంటర్కు పంపించకపోతే వారు వెనుకబడిపోతారనే భావన తల్లిదండ్రుల్లో ఏర్పడుతోందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా పలు పోటీ పరీక్షల కోచింగ్ కోసం కుటుంబాలు రూ.వేల కోట్లు ఖర్చు చేస్తున్నారని.. ఆ భారాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. చదువుల కోసం యువత.. వారి కుటుంబాలకు దూరంగా వెళ్లాల్సిన పరిస్థితి కూడా తగ్గాలని అభిప్రాయపడ్డారు.














