ఈతరం భారతం న్యూఢిల్లీ ఆగస్ట్ 16 ఆదివారం:
పశ్చిమ బెంగాల్ మాజీ డిప్యూటీ స్పీకర్, టీఎంసీ సీనియర్ నేత ఆత్మహత్య రాజకీయంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఆయన పార్టీ ఆఫీసులోనే ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఎన్నికల్లో టీఎంసీ పరాజయం తర్వాత ఆ పార్టీ, నాయకుల పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. ఈ నేపథ్యంలో తీవ్రమైన మానసిక ఒత్తిడి, వేధింపులను ఎదుర్కొని మాజీ స్పీకర్ ప్రాణాలు తీసుకున్నారని మమతా బెనర్జీ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మరణం పార్టీకి పూడ్చలేని లోటని వాపోయారు.టీఎంసీ సీనియర్ నాయకుడు, తనకు అత్యంత సన్నిహితుడైన మాజీ డిప్యూటీ స్పీకర్ ఆశిష్ బెనర్జీ మృతి పై మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. వేధింపులు, తీవ్రమైన మానసిక ఒత్తిడే ఆయన మరణానికి కారణమని ఆమె ఆరోపించారు. ‘‘క్రూరమైన రాజకీయ శత్రుత్వానికి బలయ్యే మనుషుల ప్రాణాల విలువేంటో మనందరినీ ఒక్కసారి ఆగి, ఆలోచించేలా ఈ ఘటన చేస్తోంది’’ అని దీదీ ఆవేదనకు గురయ్యారు. ఆశిష్ బెనర్జీని ‘‘పదే పదే అవమానించి, అబద్ధపు ఆరోపణలు మోపి, తీవ్ర మానసిక ఒత్తిడికి గురిచేశారు’’ మమతా బెనర్జీ వాపోయారు. పార్టీ కార్యాలయంలో ఆశిష్ బెనర్జీ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే.













