EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

రైతుల బకాయిల చెల్లింపులకు మూడు నెలల గడువు నవ ఫుడ్ ఫ్యాక్టరీ యాజమాన్యానికి కలెక్టర్ ఆదేశం

ఈతరం భారతం తిరుపతి, సెప్టెంబర్ 29 రిపోర్టర్ మనోజ్ కుమార్:

___________________________________________________

యర్రావారిపాలెం నవ ఫుడ్ ఫ్యాక్టరీ రైతులకు చెల్లించాల్సిన బకాయిలను మూడు నెలల్లోగా చెల్లించేలా స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక సమర్పించాలని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో రైతుల బకాయిల చెల్లింపులపై నిర్వహించిన సమీక్షలో ఫ్యాక్టరీ యజమాని అబ్దుల్ ఆలీ, జాయింట్ కలెక్టర్ ఆర్. గోవిందరావు, శ్రీకాళహస్తి ఆర్డీవో బాను ప్రకాష్ రెడ్డి, ఉద్యానశాఖ అధికారులు, యర్రావారిపాలెం, చిన్నగొట్టిగల్లు, రొంపిచర్ల మండలాల రైతులు పాల్గొన్నారు. గతంలో పలుమార్లు సమయం ఇచ్చినా బకాయిలు పూర్తిస్థాయిలో చెల్లించలేదని కలెక్టర్ పేర్కొన్నారు. మరో సీజన్ వరకు చెల్లింపులను వాయిదా వేయడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఒకేసారి చెల్లించడం సాధ్యం కాకపోతే రెండు, మూడు విడతల్లో అయినా మూడు నెలల్లోపు బకాయిలు చెల్లించేలా ప్రణాళిక ఇవ్వాలని సూచించారు.

ఫ్యాక్టరీ యాజమాన్యానికి సంబంధించిన వ్యక్తిగత, సంస్థ ఆస్తుల పూర్తి వివరాలను రెండు రోజుల్లో జాయింట్ కలెక్టర్‌కు సమర్పించాలని ఆదేశించారు. రైతులకు చెల్లించాల్సిన బకాయిలకు సంబంధించి నోటరీ అఫిడవిట్ సమర్పించి, నిర్ణీత గడువులో చెల్లింపులు జరగని పక్షంలో చట్టపరమైన రికవరీ చర్యలకు అంగీకరిస్తున్నట్లు స్పష్టమైన హామీ ఇవ్వాలని సూచించారు. రైతుల వారీగా, గ్రామాల వారీగా బకాయిల వివరాలను సేకరించి జాబితా రూపొందించాలని, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు చెల్లింపుల్లో ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ తెలిపారు. రైతుల ప్రయోజనాల విషయంలో ఇకపై జాప్యం సహించేది లేదని స్పష్టం చేస్తూ, మూడు నెలల్లో బకాయిలు చెల్లించకపోతే నిబంధనల మేరకు చట్టపరమైన చర్యలు చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు.

Related News

Select the Topic
Scroll to Top