ఈతరం భారతంహైదరాబాద్ అక్టోబర్ 22:
___________________________________
రాజకీయ విభేదాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలను ఒకే వేదికపైకి తీసుకువచ్చి సామాజిక సామరస్యాన్ని, స్నేహభావాన్ని బలోపేతం చేయడంలో ‘అలయ్ బలయ్’ కార్యక్రమం విశేష పాత్ర పోషిస్తోందని రాష్ట్ర గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా అన్నారు. తెలంగాణ సమృద్ధమైన సంస్కృతి, సంప్రదాయాలు, వారసత్వానికి ఈ కార్యక్రమం ప్రతీకగా నిలుస్తోందని పేర్కొన్నారు.
గురువారం హైదరాబాదులోని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో ఆయన కుమార్తె విజయలక్ష్మి “నషా ముక్త్ భారత్… వికసిత్ భారత్” నినాదంతో ” దత్తన్న అలయ్ బలయ్” కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్ల ,తన సతీమణి శ్రీమతి జానకి శుక్లాతో కలిసి హాజరయ్యారు.గవర్నర్ దంపతులను పూర్వ గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ సత్కరించారు.అంతకుముందు హాజరైన వారి తో నషా ముక్త్ భారత్ ప్రతిజ్ఞ చేయించారు.
ఈ సందర్భంగా గవర్నర్ తన సందేశాన్ని ఇచ్చారు. అన్ని రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, సామాజిక కార్యకర్తలు, వివిధ వర్గాల ప్రజలు ఒకే వేదికపై కలవడం భారతదేశంలోని భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనమని గవర్నర్ అన్నారు. తెలంగాణకు ప్రత్యేకమైన బతుకమ్మ, బోనాలు వంటి పండుగలు ప్రజల మధ్య ఐక్యతను, సామూహిక స్ఫూర్తిని ప్రతిబింబిస్తాయని తెలిపారు.
తెలంగాణ ఉద్యమ కాలంలో 2005లో శ్రీ బండారు దత్తాత్రేయ ప్రారంభించిన ‘అలయ్ బలయ్’ సంప్రదాయం రాజకీయ విభేదాలను పక్కనపెట్టి ప్రజలను కలిపే సామాజిక వేదికగా అభివృద్ధి చెందిందని గవర్నర్ పేర్కొన్నారు. ఈ సంప్రదాయాన్ని నిరంతరం కొనసాగిస్తూ ముందుకు తీసుకువెళ్తున్న బండారు విజయలక్ష్మికి అభినందనలు తెలిపారు.
ప్రజాస్వామ్యంలో విధానాలు, ఆలోచనల పరంగా భిన్నాభిప్రాయాలు సహజమని, అయితే అవి పరస్పర గౌరవం, స్నేహభావం, సహకారానికి అడ్డంకిగా మారకూడదని గవర్నర్ స్పష్టం చేశారు. భిన్నత్వాన్ని గౌరవించడం భారతదేశ ఐక్యతకు పునాది అని, రాష్ట్ర ప్రగతి ఆర్థిక, సాంకేతిక అభివృద్ధితోపాటు పౌరుల మధ్య విశ్వాసం, సహకారం, సామరస్యంపై కూడా ఆధారపడి ఉంటుందని అన్నారు.
యువత సాంస్కృతిక మూలాలను గౌరవించాలి
యువత తమ సాంస్కృతిక మూలాల పట్ల గర్వంగా ఉండాలని, ఇతరుల సంప్రదాయాలను గౌరవించాలని గవర్నర్ పిలుపునిచ్చారు. తమ ప్రతిభను సమాజ సేవకు, దేశాభివృద్ధికి వినియోగించాలని సూచించారు. వ్యక్తిగత విజయాలు సమాజానికి, దేశానికి ఉపయోగపడినప్పుడే వాటికి నిజమైన సార్థకత లభిస్తుందని పేర్కొన్నారు.
మాదకద్రవ్యాల నిర్మూలనకు సమష్టి పోరాటం
మాదకద్రవ్యాల సమస్య దేశ భవిష్యత్తుకు తీవ్రమైన ముప్పుగా మారుతోందని గవర్నర్ ఆందోళన వ్యక్తం చేశారు. మాదకద్రవ్యాల నిర్మూలన పోలీసుల బాధ్యత మాత్రమే కాదని, ప్రభుత్వ యంత్రాంగం, విద్యాసంస్థలు, సామాజిక సంస్థలు, ప్రజలు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్‌గా పనిచేసిన సమయంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తనకు రాష్ట్రంలో మాదకద్రవ్యాల వ్యతిరేక ఉద్యమాన్ని చేపట్టాలని సూచించిన విషయాన్ని గవర్నర్ గుర్తుచేశారు. తెలంగాణకు వచ్చిన తర్వాత కూడా ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించినట్లు తెలిపారు. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో సుమారు 15 వేల మంది విద్యార్థులతో కలిసి ముఖ్యమంత్రి, మంత్రివర్గ సభ్యుల సమక్షంలో మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటామని, వాటి నిర్మూలన కోసం కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేయించినట్లు వివరించారు.
ఈ నెల 28న ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులతో మాదకద్రవ్యాల వ్యతిరేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. యువత మాదకద్రవ్యాలకు ఆకర్షితులు కాకుండా అవగాహన కల్పించడంతోపాటు, వ్యసన నిర్మూలనకు ప్రజలందరూ ఉద్యమ స్ఫూర్తితో ముందుకు రావాలని కోరారు.
సంప్రదాయ మాదకద్రవ్యాలతో పోలిస్తే సింథటిక్ డ్రగ్స్ మరింత ప్రమాదకరమైనవని గవర్నర్ హెచ్చరించారు. యువత భవిష్యత్తును కాపాడేందుకు ఈ ముప్పును అరికట్టడం అత్యంత అవసరమని పేర్కొన్నారు.
2029 నాటికి దేశాన్ని మాదకద్రవ్యాల రహితంగా మార్చాలన్న ప్రధానమంత్రి లక్ష్య సాధనకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని గవర్నర్ పిలుపునిచ్చారు. ‘అలయ్ బలయ్’ వంటి సామాజిక కార్యక్రమాలు మాదకద్రవ్యాల వ్యతిరేక ఉద్యమానికి వేదికలుగా మారడం అభినందనీయమని అన్నారు.
దేశ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం
సామాజిక సామరస్యం, సాంస్కృతిక ఐక్యత, జాతీయ సమైక్యతను బలోపేతం చేయడంలో ప్రతి పౌరుడికి బాధ్యత ఉందని గవర్నర్ పేర్కొన్నారు. దేశం పట్ల అంకితభావంతో వ్యవహరిస్తూ జాతీయ ప్రయోజనాలకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని పిలుపునిచ్చారు.
‘అలయ్ బలయ్’ సంప్రదాయం భవిష్యత్తులోనూ సామాజిక సామరస్యాన్ని, సాంస్కృతిక ఐక్యతను, జాతీయ సమైక్యతను మరింత బలోపేతం చేయాలని గవర్నర్ ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో వివిధ రంగాలలో ప్రతిభ కనబరిచిన వ్యక్తులను గవర్నర్ , ఇతర అతిథులు సత్కరించారు.కార్యక్రమంలో పంజాబ్ గవర్నర్ శ్రీ గులాబ్ చాంద్ కటారియా, పూర్వ ఉప రాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు, పూర్వ గవర్నర్ శ్రీ విద్యా సాగర్ రావు, కేంద్రమంత్రి శ్రీ కిషన్ రెడ్డి, ప్రజా ప్రతినిధులు , రాజకీయ పార్టీ ల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.














