ఈతరం భారతం హైద్రాబాద్ అక్టోబర్ 27:
_______________________________
రాష్ట్రంలో వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా విచ్చలవిడిగా పెయిన్కిల్లర్లు (ఎన్ఎస్ఏఐడీలు), యాంటీబయోటిక్స్ ఔషధాల విక్రయాలను అరికట్టేందుకు కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (సీడీఎస్సీఓ) జారీ చేసిన మార్గదర్శకాలను పకడ్బందీగా అమలు చేయాలని హెల్త్‌కేర్ రిఫార్మ్స్ డాక్టర్స్ అసోసియేషన్ (హెచ్ఆర్డీఏ) రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.ఈ మేరకు తెలంగాణ సేఫ్ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్ అథారిటీ (టీజీ సేఫ్) కమిషనర్‌తో పాటు డ్రగ్స్ వింగ్ డైరెక్టర్‌కు అసోసియేషన్ ప్రతినిధులు మంగళవారం లిఖితపూర్వక వినతిపత్రం అందజేశారు. వైద్యుల పర్యవేక్షణ లేకుండా విచక్షణారహితంగా పెయిన్కిల్లర్లు, యాంటీబయోటిక్స్ వాడటం వల్ల ప్రజారోగ్యం తీవ్ర ప్రమాదంలో పడుతోందని, ముఖ్యంగా దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధులు (సీకేడీ), అక్యూట్ కిడ్నీ ఇంజ్యురీలతో పాటు యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ పెరిగి ఇన్ఫెక్షన్లు తగ్గని పరిస్థితి తలెత్తుతోందని అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేసింది.
కేంద్ర ఆరోగ్య సేవల డైరెక్టరేట్ జనరల్ నిబంధనల ప్రకారం చాలా వరకు పెయిన్కిల్లర్లు ‘షెడ్యూల్ హెచ్’ పరిధిలోకి, అత్యధిక యాంటీబయోటిక్స్ ‘షెడ్యూల్ హెచ్1’ పరిధిలోకి వస్తాయని, వీటిని రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా నేరుగా విక్రయించడం చట్టవిరుద్ధమని పేర్కొంది. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టం-1940, డ్రగ్స్ రూల్స్-1945 నిబంధనలను ఉల్లంఘించి మెడికల్ దుకాణాల్లో నేరుగా మందులు విక్రయిస్తున్న వారిపై కఠిన చర్యలు చేపట్టాలని కోరింది. జిల్లా స్థాయిలో ఔషధ నియంత్రణ అధికారులు ఫార్మసీలు, రిటైల్ మెడికల్ షాపుల్లో నిరంతర ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని, షెడ్యూల్ హెచ్1 మందుల రికార్డులను సక్రమంగా తనిఖీ చేయాలని విజ్ఞప్తి చేసింది. గడువు ముగిసిన, పాత ప్రిస్క్రిప్షన్లతో మందులు ఇవ్వకుండా నిరోధించాలని, డాక్టర్ చీటీ ఉంటేనే ప్రిస్క్రిప్షన్ మందులు ఇస్తామనే సమాచార బోర్డులను ప్రతి మెడికల్ షాపులో స్పష్టంగా ప్రదర్శించేలా ఆదేశాలు జారీ చేయాలని హెచ్ఆర్డీఏ విజ్ఞప్తి చేసింది. మందుల విచక్షణారహిత వాడకంపై ప్రజల్లో, ఫార్మసిస్టుల్లో విస్తృత అవగాహన కల్పించాలని వినతిపత్రంలో కోరింది.















