EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

జల సంరక్షణతో పల్లెలకు ఉపాధి భరోసా రాష్ట్రవ్యాప్తంగా భారీ కార్యక్రమానికి సన్నాహాలు: మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

ఈతరం భారతం హైదరాబాద్‌, నవంబరు 5:

జలవనరుల పునరుద్ధరణతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో విస్తృత ఉపాధి కల్పనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం భారీ కార్యక్రమానికి సన్నాహాలు చేస్తోందని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్‌ ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు 2027 జనవరి నుంచి జూన్‌ వరకు రాష్ట్రంలోని ప్రతి గ్రామాన్ని భాగస్వామ్యం చేస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు.

రాష్ట్ర సచివాలయంలో గురువారం సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో నిర్వహించిన ప్రత్యేక సమీక్షలో మంత్రి మాట్లాడారు. రాబోయే వర్షాకాలానికి ముందుగా ఆరు నెలలపాటు చేపట్టే ఈ కార్యక్రమాన్ని నీటిపారుదల, పంచాయత రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖలు సంయుక్తంగా అమలు చేయనున్నట్లు చెప్పారు.

గ్రామస్థులను, ముఖ్యంగా వ్యవసాయ కూలీలను పెద్దఎత్తున భాగస్వాములను చేయాలని సూచించారు.ఎల్‌నినో పరిస్థితుల ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు సమగ్ర కార్యాచరణ అవసరమని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ సవాలును అవకాశంగా మలుచుకొని దీర్ఘకాలం ఉపయోగపడే జలవనరుల ఆస్తులను సృష్టించాలని, ఇప్పటికే ఉన్న సాగునీటి మౌలిక సదుపాయాలను బలోపేతం చేయాలని చెప్పారు. గ్రామీణ ఉపాధి కల్పనతోపాటు భూగర్భజలాల లభ్యతను మెరుగుపరచేలా పనుల ప్రణాళిక ఉండాలని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో చేపట్టేందుకు వీలుగా ఇప్పటికే 355 రకాల పనులతో సమగ్ర జాబితా సిద్ధమైందని మంత్రి తెలిపారు. స్పష్టమైన లక్ష్యం, తగిన ఆర్థిక వనరులు, గ్రామస్థాయిలో సమర్థవంతమైన అమలు ప్రధానాంశాలుగా కార్యక్రమాన్ని రూపొందించాలని ముఖ్యమంత్రి సూచించినట్లు పేర్కొన్నారు. నీటిపారుదల, గ్రామీణాభివృద్ధి, భూగర్భజల, విద్యుత్‌ తదితర సంబంధిత శాఖల సమన్వయంతో ముందుకు సాగాల్సిన అవసరాన్ని వివరించారు.ఉపాధి హామీ పథకాన్ని ప్రధానంగా వినియోగించుకుంటూ ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం అమలులో ఉన్న 60:40 నిధుల నిష్పత్తికి అనుగుణంగా పనులను రూపొందించడంతోపాటు అవసరమైన చోట రాష్ట్ర ప్రభుత్వం అదనపు ఆర్థిక సహకారం అందిస్తుందని చెప్పారు. కార్యక్రమం అమలుకు అవసరమయ్యే అదనపు నిధులను రాష్ట్ర ప్రభుత్వమే సమకూరుస్తుందని భరోసా ఇచ్చారు.

ఇప్పటికే ఉన్న నీటి వనరుల పునరుద్ధరణ, పునరుజ్జీవమే కార్యక్రమానికి ప్రధాన ప్రాధాన్యంగా ఉంటుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు. చిన్ననీటి పారుదల చెరువులు, గ్రామాల్లోని కుంటలు, చెరువులకు నీటిని చేర్చే కాలువలు, సాగునీటి కాలువల్లో పూడిక తొలగింపు చేపట్టేలా ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. సంప్రదాయ జలసేకరణ నిర్మాణాల పునరుద్ధరణను కూడా ఇందులో భాగం చేయాలన్నారు.

దెబ్బతిన్న తూములు, గేట్ల మరమ్మతులు, పేరుకుపోయిన పూడిక తొలగింపు, పిచ్చిమొక్కలు, ముళ్లపొదల తొలగింపు, చెరువుల నిర్మాణాల మరమ్మతులు వంటి పనులను చేపట్టడం ద్వారా నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచాలని చెప్పారు. అందుబాటులో ఉన్న జలవనరులను సమర్థంగా వినియోగించుకునేలా పనులను ఎంపిక చేయాలని సూచించారు.

నీటిపారుదల, గ్రామీణాభివృద్ధి శాఖల సమన్వయంతో పొలాలకు నీటిని చేర్చే పంటకాలువల నిర్మాణం చేపడితే ప్రస్తుతం ఉన్న సాగునీటి సదుపాయాల వినియోగం గణనీయంగా మెరుగుపడుతుందని మంత్రి పేర్కొన్నారు. తద్వారా వ్యవసాయ ఉత్పాదకతను పెంచేందుకు అవకాశం ఉంటుందని వివరించారు.చిన్న నదులు, వాగులు, స్థానిక జలప్రవాహాలపై చెక్‌డ్యామ్‌ల నిర్మాణ అంశాన్ని కూడా సమావేశంలో చర్చించారు. వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భజలాల పునర్భరణకు దోహదపడేలా, స్థానికంగా నీటి లభ్యతను పెంచేలా ఈ పనులను పరిశీలించాలని మంత్రి సూచించారు.

భూగర్భజలాల పెంపుదల కోసం రాజస్థాన్‌, మహారాష్ట్రల్లో చేపట్టిన విజయవంతమైన కార్యక్రమాలను అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ పరిస్థితులకు అనువైన విధానాలను గుర్తించి కార్యాచరణలో పొందుపరచాలని చెప్పారు. భూగర్భజలాల పరిస్థితి, ప్రస్తుతం చేపడుతున్న చర్యలు, భవిష్యత్తు అవసరాలపై సమీక్షించేందుకు జిల్లా స్థాయి భూగర్భజల శాఖ అధికారులతో త్వరలో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు.రాష్ట్రవ్యాప్తంగా ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించేలా ఈ కార్యక్రమానికి ఆకర్షణీయమైన పేరు సూచించాలని మంత్రి అధికారులను కోరారు. వివిధ శాఖలు చేపట్టే పనులన్నింటినీ ఒకే కార్యక్రమం కింద సమన్వయం చేసేలా ప్రణాళిక రూపొందించాలని సూచించారు.

సమావేశంలో పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్‌ మిట్టల్‌, ప్రభుత్వ నీటిపారుదల సలహాదారు ఆదిత్యనాథ్‌ దాస్‌, నీటిపారుదల శాఖ కార్యదర్శి ఇ. శ్రీధర్‌, పంచాయతీరాజ్‌ కమిషనర్‌ డి. దివ్య, నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ (జనరల్‌) ఓ.వి. రమేష్‌బాబు, మిషన్‌ భగీరథ ఈఎన్‌సీ జి. కృపాకర్‌రెడ్డి, నీటిపారుదల శాఖ సహాయ కార్యదర్శి కే. శ్రీనివాస్‌, భూగర్భజల శాఖ డైరెక్టర్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top