EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

బడులు ఒంటి పూట.. ఐటీ ఇంటి బాట!🔶‘ఎల్‌నినో’తో రాష్ట్ర ప్రభుత్వ యోచన!

ఈతరం భారతం హైదరాబాద్ నవంబర్ 5 :

🍥ఎల్‌నినో ప్రభావం, నీటి కొరత ఊహించని పరిణామాలకు దారితీస్తున్నాయి. సాగు, తాగునీటికీ కటకట తలెత్తుతున్న పరిస్థితిలో విద్యార్థుల చదువుపైనా ప్రభావం చూపుతున్నాయి. పాఠశాలలు, కాలేజీల హాస్టళ్లకు అనుకోని సెలవులు తెచ్చిపెడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా బడుల సమయాల్లోనూ మార్పులు తెచ్చిపెట్టే పరిస్థితికి దారితీస్తున్నాయి. తీవ్రమైన నీటి కొరతతో ఇప్పటికే హైదరాబాద్‌లోని మాదాపూర్‌, గచ్చిబౌలి, కొండాపూర్‌, హైటెక్‌ సిటీ, కూకట్‌పల్లి ప్రాంతాల్లోని అనేక కార్పొరేట్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలలు, కాలేజీలు విద్యార్థులకు ‘నీళ్ల’ సెలవులు ప్రకటించాయి. పిల్లలను తీసుకెళ్లాలని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చాయి. ఈ సెలవుల్లో ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తామని వెల్లడించాయి. అయితే సదరు పాఠశాలలు, కాలేజీలను తిరిగి ఎప్పుడు తెరుస్తారనేది చెప్పలేదు. హైదరాబాదులో 33 విద్యాసంస్థలు తీవ్ర నీటి కొరత ఎదుర్కొంటున్నట్టు విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. నీటి సమస్య డిసెంబరులో మరింత పెరిగే అవకాశం ఉండటంతో.. ఒంటిపూట బడులు పెట్టాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. మరోవైపు ఐటీ ఉద్యోగులకూ ఇంటి నుంచే పని విధానాన్ని అమలు చేసేలా సంస్థలకు సూచించాలనీ యోచిస్తున్నట్టు తెలిసింది.

🌀ఎల్‌నినో ప్రభావం, వర్షాభావంతో.. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే సాధారణానికి మించి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. భూగర్భ జలమట్టాలు పడిపోతున్నాయి. హైదరాబాద్‌లో పరిస్థితి మరింత దారుణంగా మారింది. వేసవి తరహాలో ఎక్కడ చూసినా నీటి ట్యాంకర్లే కనిపిస్తున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో నీటి కొరత నెలకొందని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. డిసెంబరులో నీటి కొరత మరింత పెరుగుతుందని, ఉష్ణోగ్రతలూ అధికంగా నమోదవుతాయని అంచనాలు ఉన్నాయి. దీనితో విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా.. వేడి ఎక్కువ ఉన్న జిల్లాల్లో ఒంటి పూట బడులు పెట్టాలన్న దిశగా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలిసింది. జూనియర్‌ కాలేజీల వేళలూ మార్చాలని భావిస్తున్నట్టు సమాచారం. డిగ్రీ, ఇతర ఉన్నతస్థాయి కోర్సుల విద్యార్థులకు కోవిడ్‌ నాటి తరహాలో.. ఆన్‌లైన్‌ బోధన అమలు చేయాలన్న అంశాన్నీ పరిశీలిస్తున్నట్టు తెలిసింది. నీటి కొరత ప్రభావం ప్రైవేట్‌ హాస్టళ్లకే పరిమితం కాలేదు. రాష్ట్రంలోని పలు విశ్వవిద్యాలయాలు, కాలేజీలు విద్యా సంవత్సరాన్ని కుదించడం లేదా ఆన్‌లైన్‌ బోధనకు మారడం వంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి రావచ్చని అధికార వర్గాలు చెబుతున్నాయి. రాబోయే నీటి సంక్షోభంతో విద్యార్థులు ఇబ్బంది పడకుండా ముందస్తు చర్యలు తీసుకుంటామని, విద్యా సంవత్సరాన్ని కుదించే అవకాశంతో పాటు ఆన్‌లైన్‌ తరగతులనూ పరిశీలిస్తున్నామని ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ బాలకిష్టారెడ్డి పేర్కొనడం గమనార్హం.

💠ఐటీ కారిడార్‌లోని గచ్చిబౌలి, మాదాపూర్‌, కొండాపూర్‌, హైటెక్‌ సిటీ తదితర ప్రాంతాల్లో నీటి కొరత నెలకొంది. చాలా కంపెనీలు ఇప్పటికే ట్యాంకర్ల నీటిపై ఆధారపడుతున్నాయి. ఐటీకారిడార్‌లో సుమారు 5 లక్షల మంది విధులు నిర్వహిస్తున్నారు. వారికి సరిపడా నీటి లభ్యత లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీనితో ‘వర్క్‌ ఫ్రం హోం’ ఇవ్వాలని.. దానితో నీరు, విద్యుత్‌ ఆదా అవుతుందనే ప్రతిపాదనలు వస్తున్నాయి. కోవిడ్‌ నాటి నుంచి ఏడాది, రెండేళ్ల కిందటి వరకు చాలా ఐటీ కంపెనీలు ‘వర్క్‌ ఫ్రం హోం’ విధానాన్ని అమలు చేశాయి. ఇటీవలే సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. కానీ ఎల్‌నినో ప్రభావంతో మళ్లీ వర్క్‌ ఫ్రం హోం దిశగా ఆలోచిస్తున్నాయి. ఇతర రాష్ట్రాలు, జిల్లాలకు చెందిన ఐటీ ఉద్యోగులు కుటుంబాలతో తమ సొంత ప్రాంతాలకు వెళ్తే.. సుమారు 20 లక్షల మంది నగరాన్ని వీడే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. దీనిపై ఐటీ కంపెనీలకు ప్రభుత్వం త్వరలో సూచనలు చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. సంక్రాంతి నుంచి వర్క్‌ ఫ్రం హోం ఇచ్చే అవకాశం ఉన్నట్టు పేర్కొంటున్నారు.

Related News

Select the Topic
Scroll to Top