ఈతరం భారతం హైదరాబాద్ నవంబర్ 26:
హైదరాబాద్ ట్రాఫిక్‌కు చెక్ పెట్టడానికి ఐటీ కారిడార్‌లో వన్‌వే, బస్సులకు స్పెషల్ లైన్.. ఏర్పాటు చేస్తున్నట్లు డీజీపీ సీవీ ఆనంద్ ప్రకటించారు.హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు కీలక ప్రతిపాదనలకు శ్రీకారం చుడుతున్నారు. సైబరాబాద్‌లో వన్‌వే లూప్‌లు, బస్సులకు ప్రత్యేక లేన్లు ఏర్పాటు చేసే ప్రతిపాదనలను డీజీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. ఐటీ కంపెనీల పనివేళలు మార్చాలని.. ఉద్యోగులు ప్రజా రవాణాను వినియోగించాలని సూచించారు. ప్రస్తుతం సైబరాబాద్‌లో సుమారు 10 లక్షల మంది పనిచేస్తుండగా.. 80 శాతం మంది వ్యక్తిగత వాహనాల్లో వస్తున్నారని తెలిపారు. రోడ్ల విస్తరణ, ఫ్లైఓవర్లు, మెట్రో, ఎంఎంటీఎస్ సేవల మెరుగుదలపైనా దృష్టి పెట్టాలని డీజీపీ కోరారు. సమస్యకు పరిష్కారం చూపేందుకు ప్రజలు, ఐటీ సంస్థలు పోలీసులకు సహకరించాలని కోరారు. గురువారం నిర్వహించిన ‘సైబరాబాద్ మూవ్స్-2026’ సదస్సులో డీజీపీ సీవీ ఆనంద్ ఈ వ్యాఖ్యలు చేశారు. సైబరాబాద్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతాల్లో వాహనాల రద్దీని నియంత్రించేందుకు జూబ్లీహిల్స్, కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ఉన్న తరహాలో వన్‌వే లూప్‌లు ఏర్పాటు చేయాలని డీజీపీ సూచించారు.















