ఈతరం భారతం నాగర్ కర్నూల్ నవంబర్ 26:
తెలంగాణ నిరుద్యోగులకు సీఎం రేవంత్‌రెడ్డి శుభవార్త చెప్పారు. ఇప్పటికే 75 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని.. త్వరలో మరో 25 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. వీటితోపాటు 2 వేల హోంగార్డు పోస్టులను కూడా భర్తీ చేస్తామని వెల్లడించారు. నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలో ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్రకటన చేశారు. అచ్చంపేట ప్రాంతాన్ని రాష్ట్రానికే ఆదర్శంగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు 75 వేలకుపైగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిందని రేవంత్‌రెడ్డి తెలిపారు. అన్ని శాఖల్లో కలిపి లక్ష ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ లక్ష్యాన్ని పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. నిరుద్యోగులకు అండగా నిలవడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.అచ్చంపేట బిడ్డగా ఈ ప్రాంతానికి చేయాల్సినంత అభివృద్ధి చేసి రాష్ట్రానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. వీరమాంబ అచ్చమ్మ వారసత్వాన్ని ఈ నేల కొనసాగిస్తోందని గుర్తుచేశారు. ఆమె పేరుతోనే అచ్చంపేటకు ఆ పేరు వచ్చిందని పేర్కొన్నారు. ఇందిరమ్మ స్ఫూర్తితో రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో శక్తిమంతమైన ఆయుధమని.. నియంతృత్వ పాలనకు ప్రజలు తమ ఓటుతోనే ముగింపు పలకాలని అన్నారు.















