ఈతరం భారతం తిరుపతిసెప్టెంబర్ 01:రిపోర్టర్ మనోజ్ కుమార్
జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపు ప్రక్రియను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్ మీటింగ్ హాల్ నందు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపుకు సంబంధించిన సమస్యలపై జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ ఆర్.గోవిందరావుతో కలసి తిరుమల వర్కింగ్ జర్నలిస్ట్ కో–ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటి, శ్రీవారి ఎలక్ట్రానిక్ మీడియా, తిరుపతి వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ కు చెందిన ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో జర్నలిస్ట్ ల ఇంటి పట్టాల మంజూరుకు సంబంధించి పెండింగ్ దరఖాస్తుల స్థితి, లబ్ధిదారుల అర్హతలు, అనువైన స్థలాల లభ్యత, కేటాయింపు విధానాలు మరియు పథకం అమలులో ఎదురవుతున్న వివిధ అంశాలపై కలెక్టర్ సమగ్రంగా చర్చించారు. జర్నలిస్టుల ప్రతినిధులు పలు సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తూ, అర్హులైన లబ్ధిదారులకు త్వరితగతిన ఇళ్ల స్థలాలు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన కలెక్టర్, ఈ అంశాలను పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా రికార్డులను పరిశీలించి, అర్హులైన లబ్ధిదారులను గుర్తించి కేటాయింపు ప్రక్రియను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే, వివిధ శాఖల అధికారులు పరస్పరం సమన్వయంతో పనిచేసి, నిజమైన అర్హులైన జర్నలిస్టుల దరఖాస్తులను ఎలాంటి ఆలస్యం లేకుండా పరిష్కరించాలని కలెక్టర్ స్పష్టం చేశారు.ఈ సమావేశంలో తిరుపతి ఆర్డిఓ రామ్మోహన్, తిరుపతి అర్బన్, రూరల్ తహశీల్దార్ జనార్ధన్, సురేష్ బాబు, డిఐపిఆర్ఓ పి.గురుస్వామిశెట్టి, కలెక్టరేట్ అధికారులు, జర్నలిస్ట్ అసోసియేషన్ మెంబర్లు, తదితరులు పాల్గొన్నారు.















