ఈతరం భారతం జూలై 9 (తిరుపతి కరస్పాండెంట్ మనోజ్ కుమార్)
జిల్లాలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని భారత ఎన్నికల సంఘం నిర్దేశించిన గడువు ప్రకారం జూలై 12 నాటికి పూర్తిచేస్తామని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ తెలిపారు. గురువారం కలెక్టరేట్‌లో భారత ఎన్నికల సంఘం సీనియర్ ఉప ఎన్నికల కమిషనర్ డా. పవన్ కుమార్ శర్మ, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా పురోగతిని ఆయన వివరించారు.
జిల్లాలో ఇప్పటివరకు 73.4 శాతం ఎన్యూమరేషన్ ఫారాల సేకరణ పూర్తయ్యిందని, ఏఎస్‌డీ (గైర్హాజరు, నివాసం మార్చుకున్న, మరణించిన ఓటర్లు) జాబితా పరిశీలనలో 4.42 శాతం పని పూర్తైందని కలెక్టర్ తెలిపారు. మిగిలిన ఫారాల సేకరణ, ఏఎస్‌డీ నమోదుల గుర్తింపు, డిజిటలైజేషన్, ఆన్‌లైన్ అప్‌లోడింగ్ ప్రక్రియను వేగవంతంగా చేపట్టి శుక్రవారం సాయంత్రానికల్లా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించినట్లు చెప్పారు.
80 శాతం కంటే తక్కువ పురోగతి నమోదైన బూత్‌లకు అదనంగా ఇద్దరు నుంచి ముగ్గురు అధికారులను నియమించి ప్రత్యేక కార్యాచరణ చేపట్టినట్లు వెల్లడించారు. ఉదయం బీఎల్‌వోలు ఇంటింటికి వెళ్లి ఫారాల సేకరణ చేస్తుండగా, సాయంత్రం అదనపు బృందాలు వాటి పరిశీలన, డిజిటలైజేషన్, అప్‌లోడింగ్ పనులను నిర్వహిస్తున్నాయని తెలిపారు. జిల్లా యంత్రాంగం, ఎన్నికల అధికారులు, బీఎల్‌వోలు సమన్వయంతో పనిచేస్తున్నందున జూలై 12 నాటికి ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తిచేస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు.















