EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

సీతారాంపూర్‌లో ప్రీమియర్ ఎనర్జీస్ మెగా సోలార్ ప్లాంట్‌ను ప్రారంభించిన సీఎం 

ఈతరం భారతం రంగారెడ్డి జిల్లా, జూలై 9 :

తెలంగాణను హరిత ఇంధన రంగంలో అగ్రగామిగా నిలబెట్టే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం సీతారాంపూర్ పారిశ్రామిక ప్రాంతంలో రూ.3,342 కోట్ల పెట్టుబడితో 75 ఎకరాల్లో ఏర్పాటు చేసిన ప్రీమియర్ ఎనర్జీస్ అత్యాధునిక మెగా సోలార్ మాడ్యూల్ తయారీ ప్లాంట్‌ను ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ తెలంగాణ పారిశ్రామిక ప్రగతిలో ఇది ఒక కీలక మైలురాయని అన్నారు. పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు స్థానిక యువతకు ఉపాధి కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఈ ప్లాంట్ ద్వారా సుమారు 2,500 మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయని, స్థానిక యువతకు ఉద్యోగాల్లో ప్రాధాన్యత ఇవ్వాలని సంస్థ యాజమాన్యాన్ని కోరారు. భవిష్యత్తు గ్రీన్ ఎనర్జీదేనని, పర్యావరణ పరిరక్షణతో పాటు పరిశ్రమల అభివృద్ధికి ప్రభుత్వం సమాన ప్రాధాన్యత ఇస్తోందన్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్తలకు సింగిల్ విండో విధానంలో వేగవంతమైన అనుమతులు, అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో మరిన్ని హరిత పరిశ్రమలు ఏర్పాటు కావడానికి ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని స్పష్టం చేశారు. ప్రీమియర్ ఎనర్జీస్ సంస్థ సీతారాంపూర్ ప్లాంట్‌లో అత్యాధునిక G12R TOPCon టెక్నాలజీతో జీరో బస్‌బార్ (0BB) సోలార్ మాడ్యూళ్లను తయారు చేయనుంది. పూర్తిగా రోబోటిక్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత ఫాల్ట్ డిటెక్షన్ వ్యవస్థతో ప్రతి 16 సెకన్లకు నాలుగు హై-ఎఫిషియెన్సీ సోలార్ మాడ్యూళ్లను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఈ ప్లాంట్‌కు ఉంది. అదనంగా 5.6 గిగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం పెరగడంతో కంపెనీ మొత్తం సామర్థ్యం 11.1 గిగావాట్లకు చేరి దేశంలోని ప్రముఖ సోలార్ తయారీ సంస్థల్లో ఒకటిగా నిలవనుంది. ప్లాంట్ ప్రాంగణంలోనే 5,10,400 చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యాధునిక గిడ్డంగి (వేర్‌హౌస్)ను కూడా ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ప్రీమియర్ ఎనర్జీస్ మేనేజింగ్ డైరెక్టర్ చిరంజీవ్ సాలూజా, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, పారిశ్రామికవేత్తలు తదితరులు పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top