ఈతరం భారతం తిరుపతి జూలై 09 రిపోర్టర్ మనోజ్ కుమార్
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పేరులో తిరుపతి ఉన్నప్పటికీ, నగర అభివృద్ధికి తగిన ప్రాధాన్యం లభించడం లేదని *బాలాజీ రైల్వే డివిజన్ సాధన సమితి కన్వీనర్ కుప్పాల గిరిధర్ కుమార్* అన్నారు. తిరుపతి అభివృద్ధి బాధ్యతను టీటీడీ స్వీకరించి, రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి నగరాన్ని అంతర్జాతీయ స్థాయి ఆధ్యాత్మిక నగరంగా తీర్చిదిద్దాలని ఆయన కోరారు.దేశ విదేశాల నుంచి ప్రతిరోజూ లక్షలాది మంది భక్తులు శ్రీవారి దర్శనార్థం తిరుపతికి వస్తారని, వారికి తొలి స్వాగతం పలికే నగరంగా తిరుపతిని మరింత అందంగా, ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేయాల్సిన బాధ్యత టీటీడీతో పాటు రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు.
ఇటీవల కేంద్ర ప్రభుత్వం దేశంలోని మహానగరాల అభివృద్ధికి “అర్బన్ ఛాలెంజ్ ఫండ్ ” స్కీమ్ కింద రూ.4.00 లక్షల కోట్లు కేటాయించగా, ఆంధ్రప్రదేశ్ నుంచి విశాఖపట్నం, విజయవాడ మాత్రమే ఎంపికయ్యాయని గుర్తుచేశారు. జనాభా ప్రాతిపదికన తిరుపతికి అవకాశం రాకపోయినా, నగర ప్రత్యేకతను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు సాధించే దిశగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.ప్రస్తుతం టీటీడీ ఆధ్వర్యంలో 12 రకాల ట్రస్టులు అమల్లో ఉన్నాయని, వాటితో పాటు 13వ ట్రస్ట్‌గా “తిరుమల–తిరుపతి అభివృద్ధి ట్రస్ట్ (TTDT)”ను ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ ట్రస్ట్‌కు తనవంతు తొలి విరాళంగా రూ.10 లక్షలు అందజేస్తానని ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తిరుపతి అభివృద్ధి ట్రస్ట్ ఏర్పాటు లో ప్రత్యేక చొరవ తీసుకుని “P 4” లో భాగంగా కేంద్ర ప్రభుత్వ “అర్బన్ ఛాలెంజ్ ఫండ్ ” నిధులతో టీటీడీ మరియు మున్సిపల్ కార్పొరేషన్ లతో సమన్వయం చేసుకుంటూ తిరుపతి ను క్లీన్ అండ్ గ్రీన్ సిటీ గా అభివృద్ధి చేయాలని కోరారు. టీటీడీ దేశవ్యాప్తంగా సనాతన ధర్మ ప్రచారం కోసం అనేక ఆలయాల నిర్మాణం చేపడుతున్న నేపథ్యంలో, శ్రీవారు కొలువుదీరిన తిరుపతి నగర అభివృద్ధిని కూడా అత్యున్నత ప్రాధాన్యంగా తీసుకోవాలని కోరారు. తిరుపతి సమగ్ర అభివృద్ధి ద్వారా శ్రీవారి క్షేత్ర ప్రతిష్ట మరింత ఇనుమడిస్తుందని, ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపాలని కుప్పాల గిరిధర్ కుమార్ విజ్ఞప్తి చేశారు.















