ఈతరం భారతం తిరుపతి,సెప్టెంబర్ 28: రిపోర్టర్ మనోజ్ కుమార్ :
తిరుపతి కేంద్రంగా బాలాజీ రైల్వే డివిజన్‌ను తక్షణమే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ కొనసాగుతున్న ఉద్యమానికి వివిధ ఆటో యూనియన్లు సంపూర్ణ సంఘీభావం ప్రకటించాయి. బాలాజీ రైల్వే డివిజన్ సాధన కోసం సాగుతున్న పోరాటానికి తమ వంతు సహకారం అందించడంతో పాటు, భవిష్యత్ కార్యాచరణలో ప్రత్యక్షంగా పాల్గొంటామని ఆటో యూనియన్ నాయకులు స్పష్టం చేశారు.
ఆదివారం బాలాజీ రైల్వే డివిజన్ సాధన సమితి కన్వీనర్ కుప్పాల గిరిధర్ కుమార్ నివాసానికి తిరుపతి రైల్వే స్టేషన్, విష్ణు నివాసం, తిరుచానూరు రైల్వే స్టేషన్ల పరిధిలోని వివిధ ఆటో యూనియన్ నాయకులు తరలివచ్చారు. ఈ సందర్భంగా గిరిధర్ కుమార్ చేపడుతున్న నిరంతర ఉద్యమాన్ని అభినందిస్తూ తమ సంపూర్ణ మద్దతును ప్రకటించారు. రైల్వే డివిజన్ సాధన కోసం చేపట్టే రాబోయే పోరాటాల్లో ఐక్యంగా పాల్గొంటామని ముక్తకంఠంతో తెలిపారు.
తిరుపతి అభివృద్ధికి బాలాజీ రైల్వే డివిజన్ కీలకం
ఈ సందర్భంగా సాధన సమితి కన్వీనర్ కుప్పాల గిరిధర్ కుమార్ మాట్లాడుతూ.. తిరుపతిని కేంద్రంగా చేసుకుని బాలాజీ రైల్వే డివిజన్ ఏర్పాటు చేస్తే ఈ ప్రాంత అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని అన్నారు. రైల్వే డివిజన్ ఏర్పాటుతో స్థానికంగా మౌలిక వసతులు మెరుగుపడటంతో పాటు యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉందన్నారు.
వ్యాపారవేత్తలు, చిన్న తరహా వ్యాపారులు తమ కార్యకలాపాలను మరింత విస్తరించుకునే అవకాశం ఏర్పడుతుందని తెలిపారు. రోజువారీ ప్రయాణికులు, విద్యార్థులతో పాటు తిరుమల శ్రీవారి దర్శనానికి దేశ, విదేశాల నుంచి వచ్చే లక్షలాది మంది భక్తులకు రైల్వే సేవలు మరింత అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు.
బాలాజీ రైల్వే డివిజన్ ఏర్పాటు కేవలం రైల్వే పరిపాలనా అంశం మాత్రమే కాదని, తిరుపతి ప్రాంత ఆర్థికాభివృద్ధి, ఉపాధి కల్పన, వాణిజ్య విస్తరణ, రవాణా సౌకర్యాల మెరుగుదలకు ఇది కీలక అడుగుగా నిలుస్తుందని గిరిధర్ కుమార్ వివరించారు. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం బాలాజీ రైల్వే డివిజన్ ఏర్పాటుపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరారు.
ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొంటాం
గిరిధర్ కుమార్ వ్యాఖ్యలకు ఆటో యూనియన్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. బాలాజీ రైల్వే డివిజన్ సాధించే వరకు చేపట్టే ప్రజా ఉద్యమానికి అండగా ఉంటామని తెలిపారు. అవసరమైతే తమ యూనియన్ల సభ్యులతో కలిసి ప్రత్యక్ష ఆందోళనల్లో పాల్గొంటామని ప్రకటించారు. ఉద్యమాన్ని మరింత విస్తృతం చేసేందుకు తమవంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో తిరుపతి రైల్వే స్టేషన్, విష్ణు నివాసం, తిరుచానూరు రైల్వే స్టేషన్ ఆటో యూనియన్ నాయకులు ఓబుల్ రెడ్డి, నవీన్, రైల్వే బాల, సూరి, రమేష్, వెంకటరమణ, కుమార్, గోవింద్ రెడ్డి, ప్రభాకర్ యాదవ్, పార్వతి, తులసి తదితరులు పాల్గొన్నారు.















