EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

వైభవోపేతంగా చక్రధారుడి చక్రస్నానం భక్తజన సందోహంతో పులకించిన శ్రీవారి పుష్కరిణి

ఈతరం భారతం తిరుమల సెప్టెంబర్ 23 రిపోర్టర్ మనోజ్ కుమార్ :

—————————————————————————

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు బుధవారం వైభవంగా ముగిశాయి. తొమ్మిదిరోజుల బ్రహ్మోత్సవాలకు ముగింపుగా చివరి రోజున ఉదయం శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నానం (అవభృథం) అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించారు.

శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం

అంతకుముందు తెల్లవారుజామున 3 నుంచి 6 గంటల వరకు స్వామివారికి పల్లకీ ఉత్సవం వైభవంగా జరిగింది. అనంతరం ఉదయం 6 నుంచి 9 గంటల మధ్య శ్రీ భూవరాహస్వామివారి ఆలయ ముఖమండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి, శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్లకు స్నపన తిరుమంజనం వైఖానస ఆగమోక్తంగా నిర్వహించారు.

విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, ముఖప్రక్షాళన, ధూపదీప నైవేద్యం, ఛత్రచామరాది రాజోపచారాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. పాలు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, గంధంతో శంఖనిధి, పద్మనిధి, సహస్రధార, కుంభధారణల ద్వారా అభిషేకం చేశారు.

వేద మంత్ర ఘోషతో ఆధ్యాత్మిక పరిమళం

ఈ సందర్భంగా టీటీడీ వేదపారాయణదారులు ఉపనిషత్తు, దశశాంతి, పురుషసూక్తం, శ్రీసూక్తం, భూసూక్తం, నీలాసూక్తం, విష్ణుసూక్తం తదితర మంత్రాలను ఘనంగా పారాయణం చేశారు. అభిషేకానంతరం శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి దివ్య ప్రబంధ పాశురాలను పఠించారు.

ఉత్సవ యజ్ఞానికి సంపూర్ణత చేకూర్చే అవభృథం

తొమ్మిదిరోజుల బ్రహ్మోత్సవాల్లో నిర్వహించిన సమస్త సేవలు సఫలమై, లోకక్షేమం, భక్తుల సుఖశాంతులు కలగాలని చక్రస్నానం నిర్వహించడం సంప్రదాయం. బ్రహ్మోత్సవాలు ఒక యజ్ఞస్వరూపం కాగా, యజ్ఞాంతంలో నిర్వహించే అవభృథస్నానం ద్వారా ఉత్సవ నిర్వహణలో జరిగిన లోపదోషాలు తొలగి, సంపూర్ణ ఫలితాలు చేకూరుతాయని ఆగమ సంప్రదాయం.

Related News

Select the Topic
Scroll to Top