ఈతరం భారతం అహ్మదాబాద్ సెప్టెంబర్ 23
__________________________________
దేశంలో తొలి బుల్లెట్ రైలు వచ్చే ఏడాది పట్టాలపై పరుగులు తీయనుంది. ముంబయి- అహ్మదాబాద్ బుల్లెట్ కారిడార్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ కారిడార్ ద్వారా భారతీయ రైల్వే నెట్‌వర్క్‌లోకి అనేక కొత్త సాంకేతికతలు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ రైలు గంటకు 320 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. ఈ స్థాయిలో వేగంతో రైలు వెళ్తున్నప్పుడు సాధారణంగా పట్టాలు మార్చడం ఎంతో సంక్లిష్టమైన సవాలుతో కూడుకున్న పని. కానీ, సునాయాసంగా, సమతౌల్యత దెబ్బతినకుండా పట్టాలు మారేందుకు ‘ కాంటెడ్ టర్నౌట్స్ ‘ అనే టెక్నాలజీని ఇందులో ఉపయోగిస్తున్నారు. అధిక వేగంతో రైలు పట్టాలు మారే సమయంలో ఉత్పన్నమయ్యే ఒత్తిడి, ప్రకంపనలు, ప్రయాణికులకు కలిగే అసౌకర్యాన్ని తగ్గించడానికి ఈ సాంకేతికతను రూపొందించారు.
సాధారణ రైల్వే నెట్‌వర్క్‌లలో ఒక రైలు ఒక ట్రాక్ నుంచి మరొక ట్రాక్‌కి మారే ప్రదేశం (టర్నౌట్) వద్ద, వంపు మార్గాల్లో ఉండేలాంటి బ్యాంకింగ్ (అంచులు ఎత్తుగా ఉండటం) ఉండదు. అటువంటి టర్నౌట్ ద్వారా రైలు వెళ్లేటప్పుడు, దాని చక్రాలు హఠాత్తుగా మారే ట్రాక్ కోణాన్ని ఎదుర్కొంటాయి. అత్యధిక వేగం వద్ద ఇది జరగడం వల్ల రైలు, పట్టాలపై తీవ్రమైన ఒత్తిడి, ప్రకంపనలు ఏర్పడి ప్రయాణికులు అసౌకర్యానికి గురవుతారు. దీని కారణంగా సాధారణ రైళ్లు కీలక ప్రాంతాల్లో పట్టాలు మారేటప్పుడు తమ వేగాన్ని గణనీయంగా తగ్గించాల్సి వస్తుంది. కానీ ముంబయి-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు వంటి హై-స్పీడ్ రైల్ కారిడార్ కోసం విభిన్నమైన సాంకేతికతను ఉపయోగిస్తున్నారు.
కాంటెడ్ టర్నౌట్’ అనేది రైలు పట్టాలు మారే ప్రదేశంలో కూడా ట్రాక్ ‘క్యాంట్’ లేదా బ్యాంకింగ్‌ను యథాతథంగా నిర్వహిస్తుంది. సాధారణంగా వంపు మార్గాల్లో వెలుపలి వైపు ఉండే పట్టాను లోపలి వైపు ఉండే పట్టా కంటే కొద్దిగా ఎత్తుగా ఏర్పాటు చేస్తారు. వంపు తిరిగే సమయంలో రైలుపై పడే బలాలను సమతౌల్యం చేయడానికి ఈ బ్యాంకింగ్ తోడ్పడుతుంది. కాంటెడ్ టర్నౌట్‌తో ట్రాక్ నిర్మాణ రూపురేఖలను అనుకూలంగా రూపొందించడం వల్ల, రైలు సరైన క్యాంట్ (ఎత్తు)ను కోల్పోకుండానే అత్యంత సునాయాసంగా ఒక ట్రాక్ నుంచి మరొక ట్రాక్‌లోకి మారుతుంది. ఇది రైలు, దాని చక్రాలపై హఠాత్తుగా పడే ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. ప్రయాణికులకు, ఇది అత్యధిక వేగంలో కూడా ఎంతో సాఫీగా జరిగే ట్రాక్ మార్పు అనుభూతిని ఇస్తుంది.
ముంబయి- అహ్మదాబాద్ మధ్య 508 కిలోమీటర్ల కారిడార్‌ను నేషనల్ హై-స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ నిర్మిస్తోంది. ఈ మార్గంలో ఎనిమిది సొరంగాలు, వంతెనలు, వయాడక్ట్‌లు, స్టేషన్లు, ఇతర హై-స్పీడ్ రైల్ మౌలిక సదుపాయాలు ఉన్నాయి. అలాగే, సొరంగాల ప్రవేశ, నిష్క్రమణ మార్గాల వద్ద ‘వెంటిలేటెడ్ హుడ్స్’ను నిర్మిస్తున్నారు. రైలు సొరంగంలోకి వెళ్లి, వచ్చినప్పుడు ఉత్పన్నమయ్యే గాలి ఒత్తిడి, శబ్దాన్ని నియంత్రించడానికి, ఆ విస్ఫోటనం లాంటి బారీ శబ్దాన్ని తగ్గించడానికి ఈ నిర్మాణాలు తోడ్పడతాయి.















