EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

శాస్త్రోక్తంగా శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

ఈతరం భారతం తిరుపతి జూన్ 23 రిపోర్టర్ మనోజ్ కుమార్ :

అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలకు ముందుగా నిర్వహించే పవిత్రమైన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం మంగళవారం అత్యంత వైభవంగా, శాస్త్రోక్తంగా జరిగింది. జూన్ 24 నుండి జూలై 3 వరకు జరగనున్న వార్షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఆలయ పవిత్రత, ఆధ్యాత్మిక శోభను మరింత పెంపొందించే ఈ కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు.ఉదయం సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపి, తోమాలసేవ, కొలువు, అర్చన అనంతరం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం చేపట్టారు. ఆలయ గర్భగుడి, ప్రాకారాలు, గోడలు, పైకప్పు, పూజా సామగ్రిని శుద్ధి చేసి, నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డకర్పూరం, గంధం, కుంకుమ, కిచిలీగడ్డ వంటి సుగంధ ద్రవ్యాలతో తయారుచేసిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షించారు.ఈ పవిత్ర కార్యక్రమంతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక సుగంధాలతో పరిమళించి, భక్తిమయ వాతావరణాన్ని సంతరించుకుంది. అనంతరం భక్తులకు సర్వదర్శనం కల్పించారు.

వార్షిక బ్రహ్మోత్సవాలకు నాంది పలుకుతూ జూన్ 24న రాత్రి 7.30 గంటలకు అంకురార్పణం నిర్వహించనున్నారు. జూన్ 25న ధ్వజారోహణంతో సకల దేవతలను ఆహ్వానిస్తూ బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమవుతాయి. ఉత్సవాల్లో భాగంగా జూన్ 28న ఆర్జిత కల్యాణోత్సవం, జూన్ 29న గరుడసేవ, జూలై 2న రథోత్సవం, జూలై 3న చక్రస్నానం, ధ్వజావరోహణం నిర్వహించి బ్రహ్మోత్సవాలను ముగించనున్నారు.ఈ దివ్య బ్రహ్మోత్సవాల్లో పాల్గొనే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి కృపాకటాక్షాలను పొందాలని టీటీడీ కోరుతోంది.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో  హరీంద్రనాథ్, ఏఈవో  దేవరాజులు, సూపరింటెండెంట్ శ్రీమతి శ్రీవాణి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్  వేణుగోపాల్, అర్చకులు, అధికారులు, సిబ్బంది, శ్రీవారి సేవకులు పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top