ఈతరం భారతం న్యూ డిల్లి జులై 5 :
అయోధ్య రామ మందిర విరాళాలు అవకతవకలపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) అధినేత మోహన్ భగవత్ ఆదివారం కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటన తీవ్రంగా ఖండించదగినదని, దోషులను కఠినంగా శిక్షించాలని ఈ సంస్థ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబలే చేసిన ప్రకటననే ఆయన బలపరిచారు. ఇంతకు మించి అదనపు వ్యాఖ్యలు చేయడానికి ఆయన నిరాకరించారు. ‘సన్మార్గ్ మైండ్ వెల్నెస్’ ప్రారంభోత్సవ కార్యక్రమం సందర్భంగా విలేకరులతో మాట్లాడిన ఆయన, ఒక రోజు క్రితం ఆర్ఎస్ఎస్ విడుదల చేసిన అధికారిక ప్రకటనను చూడాలని కోరారు. హోసబలే మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. “తరాల పోరాటాలు, కోట్ల మంది రామభక్తుల అంకిత భావం, త్యాగం, బలిదానాల వల్ల శ్రీరామ జన్మభూమిపై నిర్మించిన ఈ అద్భుత ఆలయం యావత్ హిందూ సమాజానికి భక్తి, శ్రద్ధ, విశ్వాసాలకు కేంద్రంగా మారింది. అయితే ఈ ఆయోధ్య రామమందిరంలో ఉంచిన విరాళాల దొంగతనం ఒక దురదృష్టకర ఘటన. ఇది మొత్తం సమాజం, రామభక్తుల మనోభావాలను, భక్తిని గాయపరిచింది. మనందరినీ ఎంతగానో గాయపరిచింది. ఇది తీవ్రంగాఖండించదగినది. కనుక దర్యాప్తులో దోషులుగా తేలిన ఎవరికైనా కఠినమైన శిక్ష పడేలా చూడడం అత్యవసరం” అని అన్నారు.















