EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

‘చనిపోయే వరకు జైల్లోనే ఉండాలని తీర్పునిచ్చే అధికారం ఆ కోర్టులకు లేదు”: సుప్రీంకోర్టు సంచలన తీర్పు

ఈతరం భారతం న్యూఢిల్లీ సెప్టెంబర్ 25

________________________________

హత్య కేసుల్లో నిందితులకు క్షమాభిక్ష లేదా శిక్ష తగ్గింపు అవకాశాలు ఏమాత్రం లేకుండా జీవితాంతం అంటే చివరి శ్వాస వరకు జైలులోనే ఉండాలంటూ తీర్పులు చెప్పే పరిధి సెషన్స్ కోర్టులకు లేదని భారత సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఐపీసీ సెక్షన్ 302 కింద నమోదైన తీవ్ర నేరాల్లో శిక్షల స్వభావాన్ని విశ్లేషిస్తూ జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ విపుల్ ఎం. పాంచోలీలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం గురువారం అత్యంత కీలకమైన తీర్పును వెలువరించింది. సాధారణంగా జీవిత ఖైదు అంటే ముద్దాయి తన చివరి శ్వాస వరకు కారాగారంలోనే గడపాలని చట్టపరమైన భావన ఉన్నప్పటికీ.. రాజ్యాంగం, వివిధ చట్టాల కింద నేరస్థుడికి లభించే శిక్ష తగ్గింపు లేదా క్షమాభిక్ష హక్కులను ప్రాథమికంగానే తొలగించే అధికారం క్రింది కోర్టులకు లేదని న్యాయస్థానం తేల్చిచెప్పింది.

పంజాబ్‌లోని లుధియానాలో 2009 డిసెంబరులో జరిగిన ఒక దారుణ హత్య జరిగింది. పింకీ అలియాస్ సిమ్రాన్ అనే మహిళతో పాటు ఆమె కుమార్తెలు దివ్య (8 ఏళ్లు), పూజ (5 ఏళ్లు) దారుణంగా హత్యకు గురయ్యారు. ఈ త్రిపుల్ మర్డర్ కేసులో నవల్ కిషోర్ సహా మరొకరిని దోషులుగా నిర్ధారిస్తూ 2014లో స్థానిక విచారణ కోర్టు తీర్పునిచ్చింది. ఐపీసీ 302 ప్రకారం జీవిత ఖైదు విధిస్తూనే.. ఎలాంటి రెమిషన్ వర్తించకుండా వారి జీవిత కాలం ముగిసే వరకు జైలులోనే ఉండాలని ఆదేశించింది. ఈ తీర్పును పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు 2022 డిసెంబరులో సమర్థించింది. దీంతో నిందితులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు.ఈ సందర్భంగానే విచారణ జరిపిన న్యాయస్థానం.. న్యాయపరమైన నిబంధనలను ఉటంకిస్తూ స్పష్టమైన హద్దులను తెలిపింది. సెషన్స్ కోర్టులు ముద్దాయిలకు ఎలాంటి సడలింపులు ఇవ్వకుండా చనిపోయేవరకు జైలులోనే బంధించాలని ఆదేశాలు ఇవ్వడం చట్టబద్ధమైన నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేసింది. ఎలాంటి మినహాయింపులు లేని ఇలాంటి అత్యంత కఠినమైన శిక్షలను ఖరారు చేసే ప్రత్యేక అధికారం కేవలం హైకోర్టులు, సుప్రీం కోర్టు వంటి ఉన్నత న్యాయస్థానాలకు మాత్రమే ఉంటుందని స్పష్టంగా వెల్లడించింది. విచారణ కోర్టులు తమ పరిధిని దాటి శిక్ష తగ్గింపు అవకాశాలపై సంపూర్ణ నిషేధం విధించలేవని ధర్మాసనం వ్యాఖ్యానించింది.ముఖ్యంగా క్రింది కోర్టులు దోషులకు విధించిన శిక్షను సుప్రీం కోర్టు సవరించింది. జీవితాంతం జైల్లోనే ఉండాలన్న శిక్షను రద్దు చేస్తూ.. దాని స్థానంలో ఎలాంటి చట్టబద్ధ రెమిషన్ ప్రయోజనాలు లేకుండా 25 సంవత్సరాల కఠిన కారాగార శిక్షను ఖరారు చేస్తూ ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.

Related News

Select the Topic
Scroll to Top