ఈతరం భారతం న్యూఢిల్లీ ఆగస్ట్ 5
ఈ ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి 6.7 శాతంగా ఉంటుందని ఆర్బిఐ అంచనా వేస్తోంది.రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) ఈ ఆర్థిక సంవత్సరంలో జిడిపి వృద్ధిని 6.7 శాతంగా అంచనా వేస్తూ, రెపో రేటును 5.25 శాతం వద్ద తటస్థ వైఖరితో యథాతథంగా ఉంచాలని నిర్ణయించింది. దేశ ఆర్థిక వృద్ధికి బలమైన డిమాండ్ మద్దతు ఇస్తోందని, ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థగా దేశం నిలుస్తోందని ఆర్బిఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో దేశ ఆర్థిక వ్యవస్థ ఊహించిన దానికంటే మెరుగ్గా రాణించిందని ఆయన చెప్పారు.ద్రవ్య విధాన కమిటీ నిర్ణయాన్ని ప్రకటిస్తూ, రెపో రేటును 5.25 శాతం వద్ద యథాతథంగా ఉంచి, తటస్థ వైఖరిని కొనసాగించాలని ఆర్బిఐ నిర్ణయించిందని శ్రీ మల్హోత్రా తెలిపారు. రెపో రేటు అంటే, ప్రభుత్వ సెక్యూరిటీలకు బదులుగా కేంద్ర బ్యాంకు వాణిజ్య బ్యాంకులకు స్వల్పకాలిక రుణం ఇచ్చే వడ్డీ రేటు.
2027 ఆర్థిక సంవత్సరానికి గాను సీపీఐ ద్రవ్యోల్బణ అంచనాను ఆర్బీఐ గతంలోని 5.1 శాతం నుంచి 5 శాతానికి తగ్గించిందని ఆయన అన్నారు. ఇటీవలి ద్రవ్యోల్బణ పెరుగుదలకు విస్తృతమైన డిమాండ్ ఒత్తిళ్ల కంటే ఎక్కువగా ఆహార, ఇంధన ధరలే కారణమని గవర్నర్ తెలిపారు.ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఆర్థిక వ్యవస్థ ఊహించిన దానికంటే మెరుగ్గా రాణించడంతో, 2026-27 సంవత్సరానికి వాస్తవ జీడీపీ వృద్ధి అంచనాను 6.7 శాతానికి సవరించినట్లు మల్ హోత్ర తెలిపారు. పశ్చిమ ఆసియా సంఘర్షణ కీలక వాణిజ్య మార్గాలకు అంతరాయం కలిగిస్తూ ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు సవాళ్లు విసురుతూనే ఉందని ఆర్బిఐ గవర్నర్ అన్నారు.
ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితులు కొనసాగుతున్నప్పటికీ, బలమైన ఎగుమతులు, స్థిరమైన పెట్టుబడి కార్యకలాపాలు మరియు సరఫరా వైపు అంతరాయాలు తగ్గడం వంటివి స్థూల ఆర్థిక దృక్పథాన్ని బలోపేతం చేశాయని పేర్కొంటూ, ఆర్బిఐ దేశీయ ఆర్థిక వ్యవస్థపై ఆశాభావం వ్యక్తం చేసింది. 2026-27 సంవత్సరానికి తన వృద్ధి అంచనాను పెంచుతూనే, ద్రవ్యోల్బణ అంచనాను తగ్గించింది. బాహ్య రంగం విషయానికి వస్తే, ప్రత్యక్ష విదేశీ పెట్టుబడుల ప్రవాహం బలంగా కొనసాగుతోందని, అయితే ఇటీవలి నెలల్లో విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడులు పుంజుకున్నాయని ఆర్బిఐ తెలిపింది. దేశ విదేశీ మారక నిల్వలు దాదాపు 693 బిలియన్ డాలర్ల వద్ద సౌకర్యవంతంగా ఉన్నాయని, ఇది పది నెలలకు పైగా దిగుమతుల అవసరాలకు సరిపోతుందని గవర్నర్ అన్నారు.
షెడ్యూల్ ప్రకారం అంతా సవ్యంగా జరిగితే, వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో పాలిమర్ నోట్లు చలామణిలోకి వస్తాయని ఆర్బిఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అన్నారు. ముంబైలో జరిగిన ఒక పత్రికా సమావేశంలో మల్హోత్రా మాట్లాడుతూ, పాలిమర్ నోట్లు మన్నికను పెంచుతాయని చెప్పారు. భద్రతా ఫీచర్లు, ఇతర వివరాలను త్వరలో తెలియజేస్తామని ఆయన తెలిపారు. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సిబిడిసి), యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ఫేస్ గురించి మాట్లాడుతూ, డిప్యూటీ గవర్నర్ రోహిత్ జైన్ వీటి వినియోగం పెరుగుతోందని, వివిధ భాగస్వాములు దీనిని ఆమోదిస్తున్నారని అన్నారు















