ఈతరం భారతం న్యూఢిల్లీ సెప్టెంబర్ 12 శనివారం
_______________________________________
భారతదేశానికి దౌత్యపరంగా మరో అద్భుత విజయం దక్కింది. భారత్ అధ్యక్షతన జరుగుతున్న 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో న్యూఢిల్లీ డిక్లరేషన్‌కు ఏకగ్రీవ ఆమోదం లభించింది.బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో తొలిరోజు చర్చల ముగింపులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ… న్యూఢిల్లీ డిక్లరేషన్ ఆమోదం పొందినట్టుగా ప్రకటించారు. ”ఏ సభ్యు దేశం కూడా ఎలాంటి అభ్యంతరం లేవనెత్తలేదు. న్యూఢిల్లీ డిక్లరేషన్ 2026 ఏకగ్రీవంగా ఆమోదించబడింది” అని ప్రధాని మోదీ తెలిపారు._
బ్రిక్స్ సభ్య దేశాలైన ఇరాన్, సౌదీ అరేబియా, యూఏఈల మధ్య పశ్చిమాసియా వివాదంపై తీవ్ర విభేదాలు నెలకొన్నాయి. అయితే వీటన్నింటిని అధిగమించి బ్రిక్స్ కూటమి శనివారం ఏకాభిప్రాయంతో ఈ డిక్లరేషన్ ప్రకటనను ఆమోదించింది.అయితే న్యూఢిల్లీ డిక్లరేషన్ ఏకగ్రీవంగా ఆమోదం పొందడంలో భారత్ తన దౌత్య నైపుణ్యాన్ని ప్రదర్శించింది. ఎందుకంటే ఏ ఒక్క సభ్య దేశం కూడా ఈ డిక్లరేషన్‌పై ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు. అయితే ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం…ఈ డిక్లరేషన్‌కు సంబంధించిన చర్చలు తెల్లవారుజామున 4 గంటల వరకు కొనసాగాయి . ఆ తర్వాత అన్ని పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. బ్రిక్ కూటమిలో డిక్లరేషన్ ఆమోదం పొందడం అంత తేలికైన విషయం కాదు. ఎందుకంటే బ్రిక్స్ అనేది ఏకాభిప్రాయం ఆధారిత కూటమి… అంటే ఏ ఒక్క సభ్య దేశమైనా తుది జాయింట్ డిక్లరేషన్‌ను అడ్డుకోగలదు.
ఇక, వాస్తవానికి ఈ జాయింట్ డిక్లరేషన్‌కు సంబంధించి అనేక సున్నితమైన, వివాదాస్పద అంశాలపై బ్రిక్స్ దేశాల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. వివిధ దేశాల వ్యూహాత్మక, భౌగోళిక రాజకీయ ప్రయోజనాల కారణంగా చర్చలు సుదీర్ఘంగా సాగాయి. అందువల్ల ఏకాభిప్రాయాన్ని సాధించే ప్రయత్నంలో భాగంగా భారతదేశం అన్ని పక్షాలతో నిరంతరం సంప్రదింపులు జరిపింది.ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా అటు ఇరాన్‌తో సౌదీ అరేబియా, యూఏఈల మధ్య విభేదాలు ఉన్న సంగతి తెలిసిందే. పశ్చిమ ఆసియాకు సంబంధించిన అనేక ప్రాంతీయ, భౌగోళిక రాజకీయ సమస్యలపై ఈ దేశాల వైఖరులలో తీవ్రమైన విభేదాలు ఉన్నాయి. దీంతో ఈ దేశాలను జాయింట్ డిక్లరేషన్‌కు అంగీకరించేలా చేయడం భారతదేశానికి ఒక పెద్ద దౌత్యపరమైన సవాలుగా మారింది. వివిధ సమస్యలపై భిన్నమైన వైఖరులు ఉన్నప్పటికీ.. భారతదేశం చర్చల ద్వారా ఒక మధ్యేమార్గాన్ని కనుగొనడానికి ప్రయత్నించింది. ఈ క్రమంలోనే న్యూఢిల్లీ డిక్లరేషన్ ఆమోదంలో భారత్ సాధించిన దౌత్యపరమైన పురోగతిని చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తున్నారు.
ఇదిలాఉంటే, మారుతున్న ప్రపంచాన్ని కాలం చెల్లిన సంస్థలతో నడిపించలేమని బ్రిక్స్ సమావేశంలో ఈరోజు జరిగిన చర్చ స్పష్టం చేస్తుంది. ప్రాతినిధ్యం, స్పందన, నియమాల రూపకల్పనలో సంస్కరణలు అత్యవసరంఅని ప్రధాని మోదీ తొలి రోజు తన ముగింపు ప్రసంగంలో పేర్కొన్నారు. భవిష్యత్ సాంకేతిక పరిజ్ఞానాల అభివృద్ధిలోనూ, వాటిని నియంత్రించే నియమాలలోనూ గ్లోబల్ సౌత్‌కు సమాన భాగస్వామ్యం ఉండాలని ఆకాంక్షించారు. నిర్ణయాలకు, వాటి ఫలితాలకు మధ్య ఉన్న అంతరాన్ని భాగస్వామ్యం, సామూహిక చర్యల ద్వారా పూడ్చాలనిఅన్నారు. ”ఈ రోజు ఆమోదించిన న్యూఢిల్లీ ప్రకటన మన ఉమ్మడి సంకల్పానికి స్పష్టమైన దిశానిర్దేశం చేస్తుంది. ఈ తీర్మానాలను స్పష్టమైన ఫలితాలుగా మార్చడం ఇప్పుడు మన బాధ్యత” అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.















