ఈతరం భారతం ముంబై ఆగస్ట్ 4
హిందీ, తెలుగు చిత్ర పరిశ్రమల్లో విలక్షణ నటుడిగా, శక్తివంతమైన విలన్ పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ప్రముఖ నటుడు ప్రదీప్ రావత్ (74) మంగళవారం కన్నుమూశారు. బ్లడ్ క్లాట్ కారణంగా గుండెపోటుకు గురైన ఆయన ముంబైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సాయంత్రం 5:30 గంటలకు తుదిశ్వాస విడిచినట్లు తెలుస్తోంది.
బాలీవుడ్లో ‘లగాన్’ చిత్రంతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రదీప్ రావత్, దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన ‘సై’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమయ్యారు. అనంతరం ‘ఛత్రపతి’ చిత్రంలో పోషించిన క్రూర విలన్ పాత్రతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. తన ప్రత్యేక నటన, గంభీరమైన హావభావాలతో విలన్ పాత్రలకు కొత్త గుర్తింపును తీసుకొచ్చారు.
తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో కలిపి 70కు పైగా చిత్రాల్లో నటించిన ప్రదీప్ రావత్, సౌత్ ఇండియన్ సినీ పరిశ్రమలో అత్యంత బిజీ క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో ఒకరిగా నిలిచారు. టాలీవుడ్లో చివరిసారిగా ‘గాయపడ్డ సింహం’ సినిమాలో కనిపించారు.వ్యక్తిగత జీవితంలో తన ఒక్కగానొక్క కుమారుడిని హీరోగా పరిచయం చేయాలనే ఆశతో ప్రయత్నాలు చేస్తున్న సమయంలోనే ఆయన మరణించడం కుటుంబ సభ్యులు, అభిమానులను మరింత విషాదంలో ముంచెత్తింది.ప్రదీప్ రావత్ మరణ వార్తతో సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు ఆయనకు నివాళులర్పిస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.















