ఈతరం భారతం హైదరాబాద్, ఆగస్టు 4:
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతతో రూపొందుతున్న ‘వనమోహిని’ చిత్రాన్ని త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ఆ చిత్ర దర్శకుడు, నిర్మాత, శంకర భగవాన్ హ్యుమానిటీ ట్రస్ట్ వ్యవస్థాపకులు, చైర్మన్ శంకర భగవాన్ ఋషి తెలిపారు.
సమాజంలో మహిళల గౌరవం, వారి ప్రాధాన్యత, విలువలను ప్రతిబింబించే సామాజిక సందేశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం సినిమా నిర్మాణం సుమారు 60 శాతం పూర్తయిందని, మొత్తం 150 నిమిషాల నిడివితో ఈ చిత్రాన్ని అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో రూపొందిస్తున్నామని తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 150 నిమిషాల నిడివి గల పూర్తిస్థాయి ఏఐ ఫీచర్ ఫిల్మ్ రూపొందిన దాఖలాలు చాలా అరుదని, ఆ దిశగా ‘వనమోహిని’ ఒక వినూత్న ప్రయత్నంగా నిలవబోతోందని ఆయన పేర్కొన్నారు.
ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది.సోమవారం హైదరాబాద్ బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన కార్యక్రమంలో ‘వనమోహిని’ సినిమా పోస్టర్‌తో పాటు టీజర్‌ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా శంకర భగవాన్ ఋషి మాట్లాడుతూ, శంకర భగవాన్ హ్యుమానిటీ ట్రస్ట్ (www.sbhtrust.org) ద్వారా చేపడుతున్న సేవా కార్యక్రమాలకు ఆర్థిక వనరులు సమకూర్చే లక్ష్యంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఈ సినిమా ద్వారా వచ్చే ఆదాయాన్ని అనాథాశ్రమం ఏర్పాటు చేయడం, విద్య, వైద్యం, అన్నదానం తదితర సేవా కార్యక్రమాలకు వినియోగిస్తామని చెప్పారు.
అలాగే ‘వనమోహిని’ చిత్రాన్ని ‘బోలేనాథ్ ఛానల్’ యూట్యూబ్ ఛానల్ ద్వారా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో చిత్ర బృందానికి చెందిన శంకర భగవాన్ ఋషి గారు, గంప నాగరాజు, గొట్టిపాముల మణికుమార్, శౌరి పసల పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ వ్యాపార వేత్త సోని శ్రీనివాస్ ( బేగం బజార్ ), శ్రీరామ్ కుమార్ జోషి (నేషనల్ ప్రెసిడెంట్ గోరక్షా – రాష్ట్రీయ వానరసేన), ప్రాచి జైన్ (బీజేపీ మహిళా మోర్చా నాయకురాలు) పాల్గొని చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి పలువురు సినీ, సామాజిక, మీడియా రంగాల ప్రముఖులు హాజరయ్యారు.















