EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

తీవ్ర ఎండలు వడగాలుల కారణంగా రోజూ 3400 అదనపు మరణాలు

ఈతరం భారతం న్యూ ఢిల్లీ మే.29 :

దేశవ్యాప్తంగా వడగాలులు బీభత్సం సృష్టిస్తున్న వేళ ఓ అధ్యయనం షాకింగ్ విషయాలను వెల్లడించింది. దేశంలో తీవ్రమైన ఎండ, వడగాలులు నమోదైన రోజు సగటున సుమారు 3,400 అదనపు మరణాలు సంభవిస్తున్నాయని తాజా అధ్యయనం అంచనా వేసింది. ఇదే పరిశోధన మరో భయంకర విషయాన్ని కూడా చెప్పింది. వడగాల్పుల తీవ్రత వరుసగా ఐదు రోజుల పాటు కొనసాగితే, ఆ మరణాల సంఖ్య ఏకంగా 30,000 వరకు చేరుకునే అవకాశం ఉందని అధ్యయనం హెచ్చరించింది. పర్యావరణ మార్పులు దేశంలోని ప్రజల మరణాలకు ఎలా కారణం అవుతున్నాయనేది ఈ అధ్యయనం స్పష్టం చేసింది.

అమెరికాలోని ‘యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా బర్కిలీ’కి చెందిన ‘ఇండియా ఎనర్జీ అండ్ క్లైమేట్ సెంటర్’ పరిశోధకులు పియూష్ నారంగ్, అశోక్ గాడ్గిల్ ఈ అధ్యయనం చేశారు. భారత్లోని అన్ని జిల్లాల్లో మరణాలను అంచనా వేసేందుకు ఈ బృందం దేశంలోని 10 నగరాల్లో తీవ్రమైన ఎండ, వడగాలులకు సంబంధిత మరణాలను విశ్లేషించింది. ఈ అధ్యయనం ఫ్రాంటియర్స్ ఇన్ ఎన్విరాన్‌మెంటల్ హెల్త్ అనే జర్నల్‌లో ప్రచురితమైంది. దేశంలోని సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ (CRS) నుంచి సేకరించిన జిల్లా స్థాయి మరణాల రికార్డులు, 2024 జనాభా అంచనాలను విశ్లేషించి పరిశోధకులు ఈ నివేదికను రూపొందించారు.

‘అదనపు మరణాలు’ డేటా ఆధారంగా ఈ అధ్యయనానికి సంబంధించిన విషయాలను పరిశోధకులు పీయూష్ నారంగ్, అశోక్ గాడ్గిల్ వెల్లడించారు. ప్రపంచవ్యాప్త అధ్యయనాలు వేడికి సంబంధిత మరణాలు పెరుగుతున్నాయని చెబుతున్నప్పటికీ భారత్లోని పలు జిల్లాల్లో వడగాలులు మరణాలను ఎలా ప్రభావితం చేస్తాయనే దానిపై సరైన సమాచారం అందుబాటులో లేదన్నారు. ఈ నేపథ్యంలో నమోదైన ‘అదనపు మరణాలు’ డేటా ఆధారంగా పరిశోధకులు ఈ నివేదికను రూపొందించారు. ప్రజారోగ్యం విభాగంలో ‘అదనపు మరణాలు’ అనేది ఒక నిర్దిష్టమైన కొలమానంగా చెబుతుంటారు. అకస్మాత్తుగా సంభవించే ప్రకృతి వైపరీత్యాలు, మహమ్మారులు, తీవ్రమైన వడగాల్పుల సమయంలో సాధారణం సంఖ్య కంటే ఎక్కువగా నమోదయ్యే మరణాలనే ‘అదనపు మరణాలు’ అని పరిగణిస్తారు. ఆ మరణాల ఆధారంగానే ఈ నివేదికను పరిశోధకులు రూపొందించారు.

గత కొన్ని రోజులుగా మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తర్ప్రదేశ్, హరియాణలోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు మించిపోయాయి. ఉత్తర, మధ్య, తూర్పు భారతదేశంలో తీవ్రమైన వడగాలులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలోనే ముఖ్యంగా దేశవ్యాప్తంగా సంభవించే మొత్తం ఎండ మరణాల్లో సింహభాగం ఐదు రాష్ట్రాల్లోనే కేంద్రీకృతమై ఉన్నట్లు అధ్యయనం గుర్తించింది. ఉత్తర్ప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లోనే అత్యధికంగా మరణాలు నమోదవుతున్నాయని తెలిపింది. ఐదు రోజుల వడగాలుల సమయంలో ఒక్క ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే సుమారు 8,100 అదనపు మరణాలు సంభవిస్తున్నాయని చెప్పింది. అదే సమయంలో అహ్మదాబాద్, జైపుర్, సూరత్ వంటి జిల్లాల్లో ఒక్కోసారి 250కి పైగా అదనపు మరణాలు సంభవిస్తున్నాయని తమ నివేదికలో పరిశోధకులు పేర్కొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top