ఈతరం భారతం న్యూ డిల్లి మే 19 :
భారత్‌లో ఎవరూ అడ్డుకోలేనటువంటి తీవ్రమైన ఆర్థిక తుపాను రాబోతుందని లోక్‌సభలో విపక్షనేత రాహుల్ గాంధీ హెచ్చరించారు. ప్రధాని మోదీ ఆర్థిక విధానాలు విఫలమవుతున్నాయని, ఆ తర్వాత వాటిల్లే భారీ నష్టాన్ని సామాన్యుడే ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. రాయ్‌బరేలీలో ఓ సభలో పాల్గొన్న రాహుల్, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక విధానాలను తప్పుబట్టారు. శ్రామిక వర్గాన్ని నష్టపరిచి, బిలియనీర్లకు ప్రయోజనం చేకూర్చే విధంగా ఆర్థిక వ్యవస్థను రూపొందించారని దుయ్యబట్టారు. పౌరులను విదేశీ ప్రయాణాలను తగ్గించుకోమని కోరుతున్న ప్రధాని, తాను మాత్రం తరచూ విదేశాలకు వెళుతున్నారని విమర్శించారు. సమస్య పెట్రోల్, విద్యుత్ వాహనాలతో కాదని, అది ద్రవ్యోల్బణంతో అని ప్రధాని అర్థం చేసుకోవాలని సూచించారు. వెంటనే చర్యలు తీసుకుని దేశాన్ని రక్షించాలని కోరారు.
“భారీ ఆర్థిక తుపాన్ రాబోతోంది. దీన్ని ఎవరూ అడ్డుకోలేరు. అంత తీవ్రమైన ఆర్థిక తుపాన్ రాబోతోంది. అది ఎంతపెద్దది అంటే మీరు, నేను మన జీవితంలో ఎప్పుడూ చూడలేనంత పెద్దది. దెబ్బ ఎవరికి తగులుతుంది? అంబానీ, అదానీలకు తగలదు. వాళ్లు తమ ప్యాలెస్‌లో కూర్చుని ఉంటారు. వాళ్ల ప్యాలెస్‌ల చుట్టూ భద్రత ఉంటుంది. భారత రైతుకు, కార్మికుడికి, యువతకు, చిన్న వ్యాపారస్థులకు, చిన్న పరిశ్రమలకు దెబ్బతగులుతుంది. ఏవైతే ఉపాధిని కల్పిస్తాయో, వాటికి నష్టం కలగనుంది. ఇప్పుడు మేం చెప్తున్నాం నెలల ముందు నుంచే నేను చెప్తున్నాను. ఆర్థిక తుపాన్ వస్తోంది, సిద్ధం కావాలి అని. ప్రజలకు భారీ దెబ్బ తగలబోతోంది, పెట్రోల్ ధరలు పెరగబోతున్నాయని, ద్రవ్యోల్బణం ఆకాశాన్ని తాకబోతోందని చెబుతున్నాను. వాళ్లేమో (బీజేపీ) రాహుల్ గాంధీకి ఏం అవగాహన లేదని అంటున్నారు. ఇరాన్- అమెరికా మధ్య యుద్ధం చెలరేగడంతో మన ఇంధన సరఫరాలను ఇరాన్ నిలిపివేసింది. ఫలితంగా దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడింది. పెట్రోల్, డీజిల్‌ను పొదుపుగా వాడుకోవాలని, ఎలక్ట్రిక్ వాహనాలకు మారాలని మోదీ ప్రజలకు సలహా ఇస్తున్నారు. కానీ, మరుసటి రోజే మోదీ స్వయంగా విదేశాలకు వెళ్తున్నారు.”
ప్రభుత్వాన్ని మార్చాలని ప్రజలకు రాహుల్ గాంధీ పిలుపు
ప్రస్తుత కేంద్ర ప్రభుత్వాన్ని మార్చకపోతే దేశం మనుగడ సాగించలేదని లోక్‌సభలో విపక్షనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. రాజకీయ వాస్తవాలపై ప్రజలు పూర్తిస్థాయిలో అవగాహన పెంచుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజల్లో అవగాహన లోపించడం వల్లే ఎంజీఎన్ఆర్ఈజీఏ వంటి గ్రామీణ సామాజిక భద్రతా కార్యక్రమాలు పూర్తిగా రద్దు అవుతున్నాయని, చిన్న రైతులు ఆర్థికంగా నాశనమవుతారని హెచ్చరించారు. మరోవైపు దేశ అగ్ర నాయకులు మాత్రం కార్పొరేట్ సామాజిక కార్యక్రమాలకు హాజరుకావడానికే దృష్టి సారిస్తున్నారని ఆరోపించారు.



