EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

తెలంగాణ ప్రజా యోధుడు..మన ‘సుద్దాల హనుమంతు’

తెలంగాణ ప్రజా యోధుడు..మన ‘సుద్దాల హనుమంతు’ 

 -భారత సుదర్శన్విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్

తెలంగాణ ఉద్యమభూమిలో దుష్ట పాలనకు వ్యతిరేకంగా పోరాడి ఒక సామాజిక, రాజకీయ, సాంస్కృతిక సేనానిగా సమరశంఖం పూరించిన ప్రజాయోధుడు  మన సుద్దాల హనుమంతు. తన జీవితమంతా ప్రజల పక్షాన నిలుస్తూ, సర్వం ధారపోసి పీడిత, అణగారిన వర్గాల ప్రజలకు పదును తగ్గని శాశ్వత ఆయుధమై అన్యాయాలు, అక్రమాలను తుదముట్టించినవారు మన సుద్దాల హనుమంతు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ప్రతి పల్లెకు పాటల తోటయై, ప్రతి వ్యక్తికీ పాటల ఊటయై కాలుకు గజ్జె, భుజాన గొంగడేసుకొని ‘పల్లెటూరి పిల్లగాడా!..పసులగాసే మొనగాడా!’ అంటూ తన కంచు కంఠంతో గొంతెత్తి ఉద్యమాలను ఉర్రూతలూగించిన ప్రజా యోధుడు మన సుద్దాల హనుమంతు.

జీవిత నేపథ్యం…

ప్రస్తుత యాదాద్రి-భువనగిరి జిల్లా (ఉమ్మడి నల్గొండ జిల్లా), మోత్కూరు మండలం పాలడుగు గ్రామంలో 1910, డిసెంబర్లో నిరుపేద పద్మశాలి కుటుంబంలో బుచ్చిరాములు, లక్ష్మినరసమ్మ దంపతులకు జన్మించిప ఆరుగురు సంతానంలో చివరగా జన్మించారు మన సుద్దాల హనుమంతు. ఆయన అసలు ఇంటి పేరు గుర్రం. జీవన పోరాటంలో భాగంగా వారి కుటుంబం గుండాల మండలంలోని సుద్దాల గ్రామంలో స్థిరపడటంతో చివరికి ఆ ఊరి పేరే ఆయన ఇంటి పేరుగా మారింది. హనుమంతు తండ్రి ఒక ఆయుర్వేద వైద్యుడు. ఆ రోజుల్లో అవకాశాల్లేకపోవడంతో పెద్దగా చదవుకోలేదు.  అయినా పట్టువదలకుండా వీధిబడిలో ఉర్దూ, తెలుగు భాషలు నేర్చుకున్నారు. చిన్నప్పటి నుంచే హరికథలు, పాటలు, నాటకాలంటే మన సుద్దాల హనుమంతు ఎంతగానో ఇష్టపడేవారు. అనేక శతకాలు, కీర్తనలు, సీస, కంద పద్యాలను సునాయాసంగా ఆయన కంఠస్థం చేశారు. యక్షగానాలు, కీర్తనలు, భజనల వంటి కళల్లోనూ ఆసక్తిని కనబరిచారు. అంతేకాదు చిన్న వయస్సులోనే ఆయన గొంతెత్తి పాడటం, నాటకాలపై ఆసక్తినీ పెంచుకోవడం జరిగింది. జీవనం కోసం ఆయన హైదరాబాద్ కు చేరి ప్రభుత్వ కార్యాలయంలో ఉద్యోగం చేశారు.

ఉద్యమ నేపథ్యం…

నాటి హైదరాబాద్ సంస్థానంలో ఆనాటి ‘ఆర్య సమాజం’ కార్యకలాపాలకు ఆకర్షితుడై ఆ ఉద్యమంలో పనిచేశారు. నాటి తెలంగాణ సాయుధ పోరాట నాయకుడు రావి నారాయణరెడ్డి అధ్యక్షతన 1944లో భువనగిరిలో జరుగిన ‘ఆంధ్ర మహాసభ’లో స్వచ్ఛంద కార్యకర్తగా చేరారు. అనంతరం రావి నారాయణరెడ్డి ఆధ్వర్యంలో కమ్యూనిస్టు పార్టీలో సాంస్కృతిక విభాగం బాధ్యతలు స్వీకరించారు. గ్రామాల్లో, పట్టణాల్లో ఎక్కడ సభలు, సమావేశాలు, పోరాటాలు జరిగినా మన సుద్దాల హనుమంతు ప్రత్యక్షమయ్యేవారు. తన కలం, గళం కలగలిపి ప్రజా పోరాటాల్లో వారిని కార్యోన్ముఖులను చేశారు. ఆనాటి హైదరాబాద్ సంస్థానంలో జరిగిన అనేక అక్రమాలను, భూస్వాముల దురాగతాలను, దొరల దౌర్జన్యాలను బుర్రకథల రూపంలో చాటి చెప్పారు. సుద్దాల హనుమంతు చెప్పే బుర్రకథ బలహీనుడిని కూడా యుద్ధానికి సిద్దం చేసిందనేది అక్షర సత్యం.

 

ఆనాటి భువనగిరి మహాసభ ప్రభావంతో హనుమంతు తన సుద్దాల గ్రామంలో ‘సంఘం’ స్థాపించారు. సంఘం పెట్టి, తన పాటలతో ప్రజల్ని ఉద్రేకపరుస్తున్నాడని మన హనుమంతుపై నిజాం ప్రభుత్వం అరెస్టు వారెంట్ జారీ చేయడంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారు. పోరాట సమయంలో ఒకనాడు రాజపేట మండలం రేణికుంటలో కమ్యూనిస్టుల గ్రామసభలో ఆరుట్ల రాంచంద్రారెడ్డి ఆరుట్ల కమలాదేవి, కురారం రాంరెడ్డి, రేణుకుంట రాంరెడ్డి, ఎలుకపల్లి యాదగిరి తదితరులతో కలిసి సుద్దాల హనుమంతు ‘మాభూమి నాటకం, గొల్ల సుద్దుల ప్రదర్శనలు’ చేస్తున్నారు. ఈ సభను చెదరగొట్టేందుకు నిజాం సైన్యం వస్తుందన్న సమాచారంతో అక్కడున్న జనం పారిపోతుండగా, ఓ వృద్ధురాలి చేతిలో ఉన్న కర్రను సుద్దాల హన్మంతు లాక్కొని, ‘వెయ్..దెబ్బ దెబ్బకు దెబ్బ..’ అంటూ ప్రజల్లో మనోధైర్యాన్ని నింపారు. ఉత్తేజితులైన ప్రజలు నాటి నిజాం సైన్యాన్ని ఊరి పొలిమేర వరకూ తరిమికొట్టారు.నాటి పాలకుల వెన్నులో తన పాటల ఈటెలతో చలిపుట్టించిన తొలి ప్రజా వాగ్గేయకారుడు మన సుద్దాల హనుమంతు. నిజాం నిరంకుశ పాలనలోని వెట్టి జీవితాలను ప్రతిబింబిస్తూ, బాల కార్మికుల అత్యంత దయనీయమైన బతుకులను ప్రపంచానికి చాటి చెప్పిన ‘పల్లెటూరి పిల్లగాడ పసులగాసే మొనగాడ/ పాలుమరిసి ఎన్నాళ్లయిందో/ ఓ పాలబుగ్గల జీతగాడా/ చాలీచాలని చింపులంగి చల్లగాలికి సగము ఖాళీ/ గోనేచింపు కొప్పెర పెట్టావా…’ అంటూ సుద్దాల హనుమంతు రాసిన గేయం ‘మాభూమి’ సినిమాలో తెరకెక్కింది. జనపదుల భాష, యాసలను బాణీలుగా మలచి పాటలో బతుకు పరిష్కారం చూపిన తెలంగాణ ఉద్యమ మొదటి వాగ్గేయకారుడు మన సుద్దాల హనుమంతు. భూమి కోసం, భుక్తి కోసం, బానిస జన విముక్తి కోసం దొరల దౌర్జన్యాలను నిరసిస్తూ మన సుద్దాల హనుమంతు రాసిన పాటలు ‘వీర తెలంగాణ’ పేరుతో ప్రచురితమై జాతీయ, అంతర్జాతీయస్థాయిలో గుర్తింపు పొందాయి. తెలంగాణ భూమిని, తెలంగాణ ప్రజల పోరాటాలను సమున్నత శిఖరంపై నిలిపాయి. నాటి నిరంకుశ పాలనలో సుద్దాల హనుమంతు యొక్క హరికథ, బుర్రకథ, యక్షగానాలే తెలంగాణ సాయుధ పోరాటానికి ప్రముఖమైన ప్రచార సాధనాలుగా ఉపయోగపడ్డాయి. ఒక చేత పెన్నూ, మరో చేత గన్ను పట్టిన మన సుద్దాల హనుమంతు నాడు తెలంగాణ సాయుధ పోరాటానికి అతి ముఖ్యమైన ప్రచార సాధనమయ్యారు. అనంతర జరిగిన తెలంగాణ స్వరాష్ట్ర సాధన మలి, తొలి ఉద్యమాల్లోనూ మన సుద్ధాల హనుమంతు కవులు, కళాకారులు, గాయకులు, రచయితలు, ఉద్యమకారులకు, నాయకులకు గొప్ప స్ఫూర్తిగా నిలిచి తెలంగాణ ఉద్యమాన్ని ఎంతో బలోపేతం చేశారు.  సుదీర్ఘ కాలం ప్రజా పోరాటాల్లో తన జీవితాన్ని అర్పించి, నిరంకుశ పాలకులపై యుద్ధభేరిని మ్రోగించిన ప్రజాగొంతుక మన సుద్దాల హనుమంతు 1982 అక్టోబర్ 10 మూగబోయింది. అమరజీవి అయినప్పటికీ అనితర సాధ్యుడుగా, చిరంజీవిగా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా కొలువుదీరుతూ అణగారిన, పేద ప్రజల హక్కుల్లో ఉద్యమ సూర్యుడిగా, ప్రజా యోధుడిగా నిలిచారు. ఆయన వర్ధంతి సందర్భంగా మనం స్మరించుకోవడం తెలంగాణ భూమికి, ప్రజలకు ఎంతో గర్వకారణం.. జై తెలంగాణ!

                                                -భారత సుదర్శన్విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్

 

 

 

 

Related News

Select the Topic
Scroll to Top