‘లోక కవి’ అందెశ్రీకి కవుల కవితాంజలి ‘జనగీతిక’
ఈతరం భారతం సాహిత్యాంశం
అందెశ్రీ అనగానే మనందరి మస్తష్కంలో మెదిలేవి”మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు””కొమ్మ చెక్కితె బొమ్మరాకొలిచి మొక్కితె అమ్మరా” అనే జన సామాన్య పాటలే కాదు, “జై బోలో తెలంగాణ” అనే స్వరాష్ట్ర ఉద్యమాన్ని శిఖరాగ్రానికి చేర్చిన ఉద్యమ పాటలతో పాటు, “జయ జయహే తెలంగాణ” అంటూ రాష్ట్ర గీతం కూడా ప్రముఖంగా ఉంటుంది. ఇన్ని రకాల వ్యత్యాసాలను తన సాహిత్యంలో ఇముడ్చుకున్న లోక కవి మన అందెశ్రీ పై ప్రముఖ కవి, రచయిత, సాహిత్య విమర్శకులు, అధ్యాపకులు డా. తిరునగరి శ్రీనివాస్ సంపాదకులుగా “జనగీతిక” అనే కవితా సంకలనాన్ని వెలువరించారు. ఈ సంకలనంలో తెలుగు సాహిత్యంలో సేవలందిస్తున్న తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్. ఏనుగు నరసింహారెడ్డి కూడా వారి కలాన్ని కదిలించి “అందె సిరి” అనే శీర్షికతో కవితనందించారు. “అన్నిట్లోనూ గెలిచి ఓడిన వీరుడా, ఓడి గెలిచిన ధీరుడా” అంటూ తమ కవితతో అంజలి ఘటించారు. సంపాదకుల వారి పిలుపుతో ఈ మహా అక్షర యజ్ఞంలో మొత్తం 67 మంది ఉద్దండుల వంటి కవులు అందెశ్రీకి అక్షరాంజలిగా తమ కలాలు కదిలించారు. “మనలో ఒకడై పాలోడై మన తల్లి చెట్టుకు పంగోడై” అంటూ ఒక కవి అందెశ్రీ మన కవుల లోకంలో ఉన్న గొప్ప అసామాన్య కవి అని చెప్పారు.
” కవి ఒక సూర్యుడు, అతడిని పిడికిట్లో బంధించలేం…కవి ఒక సముద్రుడు, మనం ఎంతకీ ఈదలేం” అంటూ అందెశ్రీ గురించి ఏం చెప్పాలి? అంటూనే సూర్యుడితో, సముద్రుడితో పోల్చారు ప్రముఖ సినీకవి శ్రీ మౌనశ్రీ మల్లిక్. “కవి లేడిప్పుడు, పాటను తన శాశ్వత జ్ఞాపకంగా ఇక్కడే వదిలి వెళ్ళాడు” అని అందెశ్రీ మన మధ్యే ఉన్నాడని కవిత్వీకరించారు మన సంపాదకులు డా. తిరునగరి శ్రీనివాస్. “ఆనాటి అభినవ భీమకవి, అక్షర సేద్యం చేసిన ఈనాటి పోతన మన అందెశ్రీ” అంటూ ఆ సాహిత్య శిఖరానికి తన శివాక్షరాల అంజలి ఘటించారు యువకవి తండు శివుడు గౌడ్. ‘అందెశ్రీ మాయమైపోకుండా ఉండాల్సింది! అంటూ శ్రీ కొండూరి కోటి బాబు, “మాయియమైపోయినాడమ్మ’ అంటూ ముగ్ధ మాధవి, “అందెశ్రీ – మనందరి శ్రీ” అని బోనాల ప్రకాశ్, “సాహితీ శిఖరం” అంటూ డి. జ్యోతి, “రాష్ట్ర గీతమైన మనిషి, ఎప్పటికీ మౌనం అవ్వడు, మాయం అవ్వడు” అంటూ నామాల రవీంద్రసూరి వంటి ఎందరో కవులు తమ కవిత్వాలతో లోకవికి అక్షరాంజలి సమర్పించారు. అందెశ్రీ నిర్యాణం తర్వాత వారి మీద వెలువడిన ఈ కవితా సంకలనంలోని కవితలన్నీ ఆయన మహనీయతను చాటి చెప్పాయి. ప్రతి తెలంగాణ వ్యక్తి ఖచ్చితంగా చదివి, దాచుకోవాల్సిన మంచి పుస్తకం ఈ “జనగీతిక”.
( ” జనగీతిక “- అందెశ్రీ కి కవుల కవితాంజలి, వెల: రూ. 150/-, సంపాదకులు: డా. తిరునగరి శ్రీనివాస్, చేయూత ప్రచురణలు, ఫోన్ :9441464764 )
పుస్తక సమీక్ష :
తండు శివుడు గౌడ్, MCA, MA, LLB
9989062441














