ఈతరం భారతం సోషల్ మీడియా
21వ శతాబ్దంలో సమాచార సాంకేతిక రంగం విపరీతంగా అభివృద్ధి చెందడంతో సామాజిక చైతన్యానికి ఒక శక్తివంతమైన సాధనంగా మారింది సోషల్ మీడియా.దీనితో ప్రపంచం ఒక కుగ్రామంగా మారిపోయింది. ఈ మార్పులో సోషల్ మీడియా అత్యంత కీలక పాత్ర పోషిస్తోంది. ఒకప్పుడు వార్తలు తెలుసుకోవడానికి పత్రికలు, రేడియో, టెలివిజన్ వంటి సంప్రదాయ మాధ్యమాలపై ఆధారపడాల్సి వచ్చేది. కానీ నేడు మొబైల్ ఫోన్ చేతిలో ఉంటే ప్రపంచంలో ఎక్కడ ఏం జరుగుతుందో క్షణాల్లో తెలుసుకునే అవకాశం కలిగింది. ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్, ఎక్స్ (ట్విట్టర్), ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికలు ప్రజల జీవితంలో విడదీయరాని భాగంగా మారాయి. అయితే సోషల్ మీడియా సమాజానికి వరమా, శాపమా అనే చర్చ నిరంతరం కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా ఇది సామాజిక చైతన్యాన్ని పెంచుతున్నదా? లేక సమాజంలో విభేదాలు, విద్వేషాలు పెంచడానికి కారణమవుతున్నదా? అనే ప్రశ్నకు సమాధానం వెతకాల్సిన అవసరం ఉంది.
సోషల్ మీడియా సామాజిక చైతన్యానికి ఒక శక్తివంతమైన సాధనంగా మారింది. గతంలో ప్రజలకు తెలియని అనేక సామాజిక సమస్యలు ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వస్తున్నాయి. ఎక్కడైనా అన్యాయం జరిగినా, అవినీతి జరిగినా, ప్రజల హక్కులు rb ఉల్లంఘించబడినా క్షణాల్లో లక్షల మందికి సమాచారం చేరుతోంది. దీంతో ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా విద్యార్థులు, యువత, మహిళలు, వెనుకబడిన వర్గాలు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తపరచడానికి సోషల్ మీడియా మంచి వేదికగా నిలిచింది. ఒకప్పుడు ప్రధాన మీడియా ప్రాధాన్యం ఇవ్వని అంశాలు కూడా సోషల్ మీడియా ద్వారా దేశవ్యాప్తంగా చర్చకు వస్తున్నాయి.
ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడంలో కూడా సోషల్ మీడియా కీలక పాత్ర పోషిస్తోంది. ప్రభుత్వ విధానాలు, చట్టాలు, ప్రజా సమస్యలపై ప్రజలు తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. అనేక సందర్భాల్లో ప్రజల స్పందనను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాలు నిర్ణయాలు మార్చుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. సామాజిక ఉద్యమాలు, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు, హక్కుల సాధన కోసం జరిగే పోరాటాలు సోషల్ మీడియా ద్వారా మరింత బలపడుతున్నాయి. ఒక ప్రాంతంలో ప్రారంభమైన ఉద్యమం దేశవ్యాప్తంగా వ్యాప్తి చెందడానికి సోషల్ మీడియా ప్రధాన కారణంగా నిలుస్తోంది.
సోషల్ మీడియాకు మరో ముఖం కూడా ఉంది. అదే దుర్వినియోగం. తప్పుడు వార్తలు, అసత్య ప్రచారాలు, వదంతులు సోషల్ మీడియా ద్వారా వేగంగా వ్యాపిస్తున్నాయి. ఏ సమాచారం నిజమో, ఏది అబద్ధమో తెలుసు కోవడం సాధారణ ప్రజలకు కష్టంగా మారుతోంది. కొందరు వ్యక్తులు, సంస్థలు లేదా రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలను తప్పుదోవ పట్టించే సమాచా రాన్ని ఉద్దేశపూర్వకంగా వ్యాప్తి చేస్తున్నారు. దీనివల్ల సమాజంలో గందరగోళం ఏర్పడటమే కాకుండా కొన్నిసార్లు హింసాత్మక సంఘటనలు కూడా చోటుచేసుకుంటున్నాయి
కుల, మత, ప్రాంతీయ విభేదాలను రెచ్చగొట్టడంలో కూడా సోషల్ మీడియా కొంతమేర ప్రతికూల పాత్ర పోషిస్తోంది. ద్వేషపూరిత వ్యాఖ్యలు, రెచ్చగొట్టే పోస్టులు, అసత్య ప్రచారాలు సమాజంలో సామరస్యాన్ని దెబ్బ తీస్తున్నాయి. ఒక చిన్న సంఘటనను వక్రీకరించి ప్రచారం చేయడం వల్ల పెద్ద ఎత్తున ఉద్రిక్తతలు ఏర్పడిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ముఖ్యంగా యువతపై సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. సమాచారాన్ని పొందడానికి ఉపయోగపడుతున్నప్పటికీ, అధిక వినియోగం వ్యసనంగా మారుతోంది. గంటల తరబడి మొబైల్ ఫోన్లలో గడపడం వల్ల చదువులు, ఉద్యోగాలు, కుటుంబ సంబంధాలు దెబ్బతింటున్నాయి. ఇతరుల జీవితాలతో తమ జీవితాలను పోల్చుకొని నిరాశకు గురయ్యే పరిస్థితులు కూడా పెరుగుతున్నాయి. మానసిక ఆరోగ్య సమస్యలు, ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలకు కూడా సోషల్ మీడియా అధిక వినియోగం ఒక కారణంగా మారుతోందని C Q నిపుణులు చెబుతున్నారు.
అయితే రాజకీయ రంగంలో సోషల్ మీడియా ప్రభావం అత్యంత ఎక్కువగా ఉంది. రాజకీయ పార్టీలు ప్రజలకు చేరువ కావడానికి దీనిని కొన్నిసార్లు వాస్తవ చర్చల కంటే ప్రచారాలు, వ్యక్తిగత దూషణలు, ద్వేషపూరిత వ్యాఖ్యలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలను గౌరవించాల్సిన అవసరం ఉన్నప్పటికీ, సోషల్ మీడియాలో విభేదాలను శత్రుత్వంగా మార్చే ధోరణి పెరుగుతోంది. ఇది ప్రజాస్వామ్య విలువలకు కూడా సవాలుగా మారుతోంది. సోషల్ మీడియా మంచిదా చెడ్డదా అనే ప్రశ్నకు ఒకే సమాధానం ఉండదు. అది పూర్తిగా దానిని ఉపయోగించే వ్యక్తులపై ఆధారపడి ఉంటుంది. కత్తితో పండును కోయవచ్చు, అదే కత్తితో హాని కూడా చేయవచ్చు. అలాగే సోషల్ మీడియా ద్వారా జ్ఞానాన్ని పంచవచ్చు, సమాజాన్ని చైతన్యవంతం చేయవచ్చు. అదే సమయంలో అసత్యాలు, విద్వేషాలు కూడా వ్యాప్తి చేయవచ్చు. కాబట్టి సమస్య వేదికలో కాదు, దాని వినియోగంలో ఉంది.
ప్రస్తుత పరిస్థితుల్లో సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా వినియోగించడం అత్యంత అవసరం. ఏ సమాచారాన్ని అయినా నమ్మే ముందు దాని నిజానిజాలను పరిశీలించాలి. ద్వేషపూరిత ప్రచారాలకు దూరంగా ఉండాలి. సమాజంలో ఐక్యత, సామరస్యం, అవగాహన పెంచే సందేశాలను ప్రోత్సహించాలి. ముఖ్యంగా యువత సోషల్ మీడియాను జ్ఞానార్జన, వ్యక్తిత్వ వికాసం, సామాజిక చైతన్యం కోసం ఉపయోగించాలి.
మొత్తంగా చూస్తే సోషల్ మీడియా ఒక శక్తివంతమైన సాధనం. అది సామాజిక చైతన్యానికి గొప్ప వేదికగా మారగలదు. అదే సమయంలో దుర్వినియోగం చేస్తే సమాజంలో విభేదాలు, విద్వేషాలు పెంచే ప్రమాదం కూడా ఉంది. సోషల్ మీడియాను బాధ్యతతో, వివేకంతో వినియోగించినప్పుడే అది సమాజ పురోగతికి దోహదపడే సాధనంగా నిలుస్తుంది.
వ్యాస రచయిత : బూర్గుపల్లి కృష్ణ యాదవ్















