EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

ఎత్తు కాదు …ప్రతిభే అసలు ప్రమాణం.  తిరస్కరణ నుంచి వైద్యుడిగా ఎదిగిన డా. గణేశ్ బారియా కథ వైరల్

ఈతరం వార్తాంశం:

సమాజంలో ఒక వ్యక్తి సామర్థ్యాన్ని వారి మేధస్సుతో కాకుండా బాహ్య రూపంతో అంచనా వేసే ధోరణి నేటికీ కొనసాగుతోంది. కానీ అంగవైకల్యం అనేది శరీరానికే తప్ప సంకల్పానికి కాదని నిరూపించారు డాక్టర్ గణేశ్ బారియా.కేవలం మూడు అడుగుల ఎత్తు ఉన్నారనే కారణంతో వైద్య విద్యకు అనర్హుడని ముద్ర వేసిన చోటే నేడు అదే వృత్తిలో రాణిస్తూ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచారు.

సవాళ్లతో సాగిన బాల్యం

గుజరాత్‌కు చెందిన గణేశ్ బారియా పుట్టుకతోనే డ్వార్ఫిజం అనే శారీరక స్థితితో జన్మించారు. ఆయన ఎదుగుదల కేవలం 3 అడుగులకే పరిమితమైంది. చిన్నతనంలోనే ఆయన ఎన్నో అవమానాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఒకానొక దశలో ఆయన రూపాన్ని చూసి వినోదం పండించడానికి సర్కస్ నిర్వాహకులు ఆయనను కొనుగోలు చేస్తామని ఆశ చూపారు. కానీ పేదరికంలో ఉన్నప్పటికీ ఆయన తండ్రి లొంగిపోలేదు. తన కుమారుడిని ఒక ప్రదర్శన వస్తువుగా కాకుండా ప్రయోజకుడిగా చూడాలని నిర్ణయించుకుని చదువు వైపు ప్రోత్సహించారు.

వ్యవస్థతో న్యాయపోరాటం

చదువులో ఎంతో ప్రతిభ కనబరిచిన గణేశ్ వైద్యుడు కావాలనే పట్టుదలతో నీట్ పరీక్షలో మంచి మార్కులు సాధించారు. అయితే అడ్మిషన్ సమయంలో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) ఆయన ఎత్తును కారణంగా చూపుతూ సీటు నిరాకరించింది. అత్యవసర సమయాల్లో రోగులకు చికిత్స అందించడానికి ఆయన ఎత్తు సరిపోదని.. ప్రాక్టికల్స్‌లో ఇబ్బందులు ఎదురవుతాయని కుంటి సాకులు చెప్పింది. నిరాశ చెందకుండా గణేశ్ తన హక్కు కోసం న్యాయపోరాటం మొదలుపెట్టారు. స్థానిక కోర్టుల నుంచి సుప్రీంకోర్టు వరకు ఆయన పోరాటం సాగింది. చివరకు 2018లో భారత అత్యున్నత న్యాయస్థానం చారిత్రాత్మక తీర్పునిచ్చింది. “వైకల్యం అనేది ప్రతిభకు అడ్డుకాకూడదు” అని స్పష్టం చేస్తూ ఆయనకు వైద్య విద్యలో ప్రవేశం కల్పించాలని ఆదేశించింది.

లక్ష్యాన్ని చేరుకున్న వైనం

న్యాయపోరాటంలో విజయం సాధించిన తర్వాత గణేశ్ భవ్నగర్ మెడికల్ కాలేజీలో చేరారు. తోటి విద్యార్థుల కంటే భిన్నంగా ఉన్నప్పటికీ తన పనితీరుతో అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆపరేషన్ థియేటర్లలో రోగులకు చికిత్స అందించడానికి ప్రత్యేకమైన స్టూల్స్‌ను ఉపయోగిస్తూ తన పరిమితులను అధిగమించారు. విజయవంతంగా ఎంబీబీఎస్ పూర్తి చేసిన ఆయన నేడు అదే ఆసుపత్రిలో కన్సల్టెంట్ డాక్టర్‌గా సేవలందిస్తున్నారు.

సమాజానికి ఒక సందేశం

డాక్టర్ గణేశ్ బారియా కథ కేవలం ఒక వ్యక్తి విజయం కాదు.. అది వివక్షపై సాధించిన గెలుపు. రూపం, ఎత్తు, రంగు వంటి బాహ్య అంశాలు మనిషి మేధస్సును నియంత్రించలేవని ఆయన నిరూపించారు. పట్టుదల ఉంటే ఆకాశమే హద్దు అని చాటిచెప్పిన గణేశ్ ప్రయాణం… వైకల్యంతో బాధపడుతున్న ఎంతోమంది యువతకు కొత్త ఆశలను చిగురింపజేస్తోంది.

Related News

Select the Topic
Scroll to Top