ఈతరం భారతం వార్తాంశం
బీసీల సమగ్ర అభివృద్ధికి సామాజిక న్యాయమే మార్గం
భారత సమాజంలో శతాబ్దాలుగా అల్పసంఖ్యాక ఆధిపత్య వర్గాల చేతుల్లో భూములు, సంపద, అధికారాలు కేంద్రీకృతమవడం వల్ల బీసీ వర్గాలు సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిపోయాయి. కుల వృత్తులపై ఆధారపడి జీవించిన ఉత్పత్తి కులాలు, సేవా వర్గాలు, కళాకారులు సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషించినప్పటికీ, వారికి కనీస గౌరవం, అవకాశాలు, మానవ హక్కులు కూడా దక్కలేదు.
భూస్వామ్య వ్యవస్థ నుంచి పారిశ్రామిక వ్యవస్థకు మారిన తర్వాత భూస్వాములు పెట్టుబడిదారులుగా, పాలక వర్గాలుగా ఎదిగారు. కానీ శ్రమజీవులు కార్మికులుగానే మిగిలిపోయారు. రెండు వ్యవస్థల్లోనూ నష్టపోయింది ఉత్పత్తి కులాల ప్రజలే. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత కూడా అధికారాలు, ఆస్తులు, రాజకీయ ప్రాధాన్యం ఆధిపత్య వర్గాల చేతుల్లోనే కొనసాగాయి. తరాలు మారినా అసమానతల అంతరాలు మాత్రం మారలేదు.
అయితే నేటి పరిస్థితుల్లో బీసీ సమాజంలో చైతన్యం పెరుగుతోంది. విద్యావకాశాలు విస్తరించడం, సామాజిక ఉద్యమాలు బలపడడం, రాజ్యాంగ హక్కులపై అవగాహన పెరగడం వల్ల బీసీలు తమ హక్కుల కోసం ప్రశ్నించడం ప్రారంభించారు. “మా జనాభాకు అనుగుణంగా పాలనలో, బడ్జెట్లో, ఉద్యోగాల్లో, నిర్ణయాధికారంలో సమాన వాటా కావాలి” అనే నినాదం గ్రామ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు వినిపిస్తోంది.
ప్రజాస్వామ్యంలో అందరూ సమానమని చెప్పే పాలకులు బీసీల జనాభా గణన ఎందుకు చేపట్టడం లేదు? ఈ దేశ మూలవాసులైన మాకు రాజ్యాంగ ఫలాల్లో న్యాయమైన వాటా ఎందుకు దక్కడం లేదు? అనే ప్రశ్నలు నేడు బలంగా వినిపిస్తున్నాయి.
స్థానిక సంస్థల ఎన్నికల్లో దాదాపు నలభై ఏళ్లుగా బీసీ రిజర్వేషన్లు అమలవుతున్నప్పటికీ, జనాభా నిష్పత్తికి తగిన ప్రాతినిధ్యం ఇప్పటికీ లేదు. అసెంబ్లీ, పార్లమెంట్ స్థాయిలో ప్రత్యేక రాజకీయ రిజర్వేషన్లు లేకపోవడంతో బీసీల తరఫున గళమెత్తే నాయకత్వం బలహీనంగా మారింది. రాజకీయ పార్టీల దయాదాక్షిణ్యాలపై ఆధారపడి కొందరికి మాత్రమే అవకాశాలు లభిస్తున్నాయి. వారు కూడా స్వతంత్రంగా మాట్లాడలేని పరిస్థితి ఏర్పడింది.
విద్య, వైద్యం, న్యాయం వంటి కనీస మౌలిక హక్కులు ఇప్పటికీ బీసీలకు పూర్తిస్థాయిలో అందడం లేదు. ప్రభుత్వ రంగాల నిర్లక్ష్యంతో ప్రైవేట్ విద్యా సంస్థలు, ప్రైవేట్ ఆస్పత్రులు విస్తరించి సామాన్య ప్రజలపై ఆర్థిక భారం పెంచుతున్నాయి. ఫలితంగా అనేక మంది విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవుతున్నారు. రోగులు కుటుంబాలకు భారమవుతున్నారు.
బీసీల కోసం అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలు కాగితాలకే పరిమితమవుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. హాస్టళ్లు, స్కాలర్షిప్లు, కోచింగ్ సెంటర్లు, ఉద్యోగ శిక్షణ కేంద్రాలను బలోపేతం చేయకుండా బీసీల అభివృద్ధి సాధ్యం కాదు.
ఆర్థిక రంగంలో కూడా పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. సంప్రదాయ కుల వృత్తులు ఆధునికీకరణ లేక యంత్రాల దెబ్బకు కనుమరుగవుతున్నాయి. చేతివృత్తులపై ఆధారపడిన అనేక కుటుంబాలు ఉపాధి కోల్పోయి అడ్డాకూలీలుగా మారుతున్నాయి. పెద్ద కంపెనీలకు రాయితీలు ఇవ్వడంలో తప్పు లేదు. కానీ చిన్న వ్యాపారాలు, గ్రామీణ వృత్తుల అభివృద్ధిపై కూడా ప్రభుత్వాలు సమాన దృష్టి పెట్టాలి. కుల వృత్తులను ఆధునిక సాంకేతికతతో అనుసంధానం చేసి మార్కెటింగ్ అవకాశాలు కల్పిస్తే బీసీలు ఆర్థికంగా బలపడతారు.
సామాజికంగా కూడా వివక్ష పూర్తిగా తొలగిపోలేదు. అనేక ప్రాంతాల్లో ఇప్పటికీ కుల ఆధారిత అవమానాలు కొనసాగుతున్నాయి. బీసీల రక్షణ కోసం ప్రత్యేక అట్రాసిటీ చట్టం తీసుకువచ్చి కఠినంగా అమలు చేస్తే సమాజంలో మార్పు వచ్చే అవకాశం ఉంది.
డాక్టర్ బి. ఆర్ . అంబేద్కర్ చెప్పినట్లుగా, మెజారిటీ ప్రజలకు పాలనలో భాగస్వామ్యం లేకుండా సామాజిక న్యాయం సాధ్యం కాదు. కేవలం సంక్షేమ పథకాలతో బీసీల సమగ్ర అభివృద్ధి జరగదు. రాజకీయ సాధికారత, విద్యా అవకాశాలు, ఆర్థిక స్వావలంబన, సామాజిక గౌరవం — ఈ నాలుగు స్తంభాలపై బీసీ భవిష్యత్తు నిర్మాణం జరగాలి.
బీసీ జనాభాకు అనుగుణంగా అధికారంలో వాటా కల్పించాలి. కుల గణన ఆధారంగా విధానాలు రూపొందించాలి. అప్పుడే నిజమైన సామాజిక న్యాయం సాధ్యమవుతుంది.
భవిష్యత్తులో వెనుకబడిన వర్గాల ప్రజలు నాయకత్వ వర్గాలుగా ఎదగాలంటే బీసీ యువత, విద్యావంతులు, మేధావులు సంఘటితమై పల్లెల నుంచి పట్టణాల దాకా చైతన్యం తీసుకెళ్లాలి. సోషల్ మీడియా, ప్రజా ఉద్యమాల ద్వారా తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలి. అప్పుడే బీసీలకు రాజ్యాధికారంలో సమాన వాటా దక్కుతుంది.
బూర్గుపల్లి కృష్ణ యాదవ్, MA
బీసీ జాగృతి సేన వ్యవస్థాపక అధ్యక్షులు
సెల్: 9866170384














