ఈ తరం భారతం ఓవర్సీస్ న్యూస్ నవంబర్ 28:
ప్రపంచ ప్రొఫెషనల్ రెజ్లింగ్ రంగంలో విషాదం చోటుచేసుకుంది. వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్‌టైన్‌మెంట్ (WWE) స్టార్ రెజ్లర్ బ్రాన్‌సన్ రీడ్ 38 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఆయన అసలు పేరు జెర్మైన్ హేలీ. వైద్యపరమైన సమస్యల కారణంగా ఆయన మరణించినట్లు డబ్ల్యూ డబ్ల్యూ ఎఫ్ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఈ విషాద వార్తతో రెజ్లింగ్ అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. తన ప్రకటనలో బ్రాన్‌సన్ రీడ్ మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసింది. రింగ్‌లో తనదైన శైలితో ప్రేక్షకులను అలరించిన ఆయన, వ్యక్తిగత జీవితంలోనూ కుటుంబానికి అంకితమైన గొప్ప వ్యక్తి అని కొనియాడింది. ఆయన భార్య పైజ్, కుమార్తె, కుటుంబ సభ్యులు, స్నేహితులు, సహచరులు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలిపింది.
క్రౌన్ జ్యువెల్ ఈవెంట్‌లో తీవ్ర గాయాలు!
ఈ నెల 7న సౌదీ అరేబియాలో జరిగిన డబ్ల్యూ డబ్ల్యూ ఈ క్రౌన్ జ్యువెల్ ఈవెంట్‌లో బ్రాన్‌సన్ రీడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మరో రెజ్లర్ ఒబా ఫెమీ ఆయనను స్టేజ్‌పై నుంచి టేబుళ్లపైకి విసిరేయడంతో తీవ్రంగా గాయపడినట్లు వార్తలు వచ్చాయి. ఈ ఘటన అనంతరం ఆయనకు పలు గాయాలైనట్లు, వైద్య చికిత్స పొందినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.
అయితే క్రౌన్ జ్యువెల్ ఈవెంట్‌లో జరిగిన గాయాలే ఆయన మరణానికి కారణమని డబ్ల్యూ డబ్ల్యూ ఈ ధ్రువీకరించలేదు. వైద్యపరమైన సమస్యల కారణంగానే మరణించినట్లు మాత్రమే సంస్థ వెల్లడించింది.
2007లో ప్రారంభమైన రెజ్లింగ్ ప్రస్థానం
ఆస్ట్రేలియాకు చెందిన బ్రాన్‌సన్ రీడ్ 2007లో తన రెజ్లింగ్ కెరీర్‌ను ప్రారంభించారు. 2019లో WWEలోకి అడుగుపెట్టారు. తన భారీ శరీరాకృతి, అద్భుతమైన పోరాట నైపుణ్యంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 2021లో NXT నార్త్ అమెరికన్ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకున్నారు. 2024లో ఆండ్రే ది జెయింట్ మెమోరియల్ బ్యాటిల్ రాయల్ టైటిల్‌ను కూడా సాధించారు.
గర్భవతిగా ఉన్న భార్య.. విషాదంలో కుటుంబం
బ్రాన్‌సన్ రీడ్ భార్య పైజ్ ప్రస్తుతం గర్భవతిగా ఉన్నారు. వీరికి ఇప్పటికే ఒక కుమార్తె ఉంది. రెండో బిడ్డకు జన్మనివ్వడానికి సిద్ధమవుతున్న సమయంలో కుటుంబంలో ఈ విషాదం చోటుచేసుకోవడం అభిమానులను మరింత కలచివేస్తోంది.
38 ఏళ్ల వయసులోనే రెజ్లింగ్ ప్రపంచానికి దూరమైన బ్రాన్‌సన్ రీడ్ మృతి పట్ల ప్రపంచవ్యాప్తంగా అభిమానులు, సహచర రెజ్లర్లు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.















