ఈతరం భారతం ఓవర్సీస్ న్యూస్ జులై 14
దుబాయ్: భారతీయ ప్రయాణికులకు ప్రముఖ అంతర్జాతీయ విమానయాన సంస్థ ఎమిరేట్స్ శుభవార్త తెలిపింది. ఇకపై ఎమిరేట్స్ విమాన టికెట్లను ఒకేసారి మొత్తం చెల్లించాల్సిన అవసరం లేకుండా, ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ ద్వారా సులభమైన నెలవారీ వాయిదాల్లో చెల్లించే సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.ఎమిరేట్స్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, భారతదేశంలోని ప్రయాణికులు emirates.com వెబ్సైట్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఎమిరేట్స్ నెట్‌వర్క్‌లోని సుమారు 140 గమ్యస్థానాలకు టికెట్లు బుక్ చేసుకోవచ్చు. టికెట్ మొత్తాన్ని ఒకేసారి చెల్లించకుండా, 3 నెలల నుంచి 36 నెలల వరకు తమకు అనుకూలమైన EMI కాలపరిమితిని ఎంచుకుని వాయిదాల రూపంలో చెల్లించుకునే అవకాశం ఉంటుంది.
ఈ సౌకర్యాన్ని పొందేందుకు ప్రయాణికులు తమ క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. ఈ EMI సేవలో యాక్సిస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్ఎస్బీసీ, ఐసీఐసీఐ బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, కొటక్ మహీంద్రా బ్యాంక్, ఆర్బీఎల్ బ్యాంక్, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), యెస్ బ్యాంక్ వంటి ప్రముఖ బ్యాంకులు భాగస్వాములుగా ఉన్నాయి.
ఈ సందర్భంగా ఎమిరేట్స్ ఇండియా & నేపాల్ వైస్ ప్రెసిడెంట్ మహమ్మద్ సర్హాన్ మాట్లాడుతూ, భారతీయ వినియోగదారులకు మరింత సౌకర్యవంతమైన చెల్లింపు విధానాన్ని అందించడం ఆనందంగా ఉందన్నారు. ఈ కొత్త EMI సౌకర్యం ద్వారా ప్రయాణికులు తమ బడ్జెట్‌కు అనుగుణంగా చెల్లింపులు చేసుకుంటూ, ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న విదేశీ విహారయాత్రలను ప్లాన్ చేసుకోవడంతో పాటు, మెరుగైన ప్రయాణ అనుభవాలను కూడా ఎంచుకునే అవకాశం లభిస్తుందని తెలిపారు.
ఎమిరేట్స్ ప్రవేశపెట్టిన ఈ కొత్త EMI చెల్లింపు విధానం భారతీయ ప్రయాణికులకు అంతర్జాతీయ ప్రయాణాన్ని మరింత అందుబాటులోకి తీసుకురావడమే కాకుండా, ఆర్థిక భారం తగ్గించే వినూత్న చర్యగా భావిస్తున్నారు.
https://chat.whatsapp.com/EdgWYMdwgF5BHGSrvGuGNQ















