ఈతరం భారతం భద్రాద్రి కొత్తగూడెం నవంబర్ 25 :
మారుమూల గిరిజన ప్రాంతాల్లో విద్యార్థులకు మెరుగైన విద్యా సదుపాయాలు కల్పించే దిశగా ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలంలోని నారాయణరావుపేట ఆశ్రమ పాఠశాలలో రూ.1.80 కోట్ల వ్యయంతో నిర్మించిన 12 అదనపు తరగతి గదులను రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బుధవారం ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అంకిత్, ఐటీడీఏ పీవో రాహుల్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్య తో పాటు అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేటు పాఠశాలలకు దీటుగా విద్యాబోధన అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందించేందుకు అల్పాహార కార్యక్రమాన్ని అమలు చేయడంతో పాటు డైట్, కాస్మెటిక్ ఛార్జీలను పెంచినట్లు వివరించారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.
దుమ్ముగూడెం అభివృద్ధికి ప్రత్యేక చర్యలు
స్థానిక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు మాట్లాడుతూ.. ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో ఉన్న మారుమూల గిరిజన ప్రాంతమైన దుమ్ముగూడెం మండల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు అవసరమని అన్నారు. మండలంలో ఇప్పటికే 1,600 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయగా, మరో 600 ఇళ్లను కేటాయించినట్లు వెల్లడించారు. రైతులకు సాగునీటి సదుపాయాలు కల్పించేందుకు చెక్‌డ్యామ్‌లు నిర్మించాలని మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.
పర్ణశాల ఘాట్ అభివృద్ధికి రూ.87 లక్షలు
మరోవైపు ప్రముఖ పుణ్యక్షేత్రమైన పర్ణశాల అభివృద్ధిపైనా ప్రభుత్వం దృష్టి సారించింది. పర్ణశాల ఎక్స్ రోడ్డు వద్ద రూ.87 లక్షల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఇందులో భాగంగా ఘాట్ వద్ద తాగునీటి సౌకర్యం కోసం ఓవర్‌హెడ్ సర్వీస్ రిజర్వాయర్, బోర్‌వెల్లు, పంపుసెట్లు, పైపులైన్లు ఏర్పాటు చేయనున్నారు. అదేవిధంగా శాశ్వత మరుగుదొడ్లను నిర్మించనున్నారు. ఈ పనులు పూర్తయితే పర్ణశాలకు వచ్చే భక్తులతో పాటు స్థానికులకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఆదినారాయణ, ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.














