ఈతరం భారతం హైదరాబాద్, నవంబర్ 26:
ఉస్మానియావిశ్వవిద్యాలయం ప్రాచ్యభాషల విభాగం తెలుగు శాఖలో పరిశోధన చేసిన జంగిలి దర్శన్‌కు పీహెచ్డీ డాక్టరేట్ అవార్డును ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రకటించింది. ‘ఆచార్య కొలకలూరి ఇనాక్ నవలలు -సమగ్ర అధ్యయనం’ అనే అంశంపై దర్శన్ పరిశోధన చేశారు. డాక్టర్ కె చంద్రశేఖర రావు పర్యవేక్షణలో ఈ పరిశోధనను కొనసాగించి, పీహెచ్డీ సిద్ధాంత గ్రంథాన్ని రూపొందించారు.రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కప్పపహాడ్ గ్రామానికి చెందిన దర్శన్ చిన్నతనం నుంచి ఎన్నో ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కష్టాలు, పేదరికాన్ని ఎదుర్కొంటూ చదువుపై పట్టుదలతో ముందుకు సాగారు.తన పరిశోధనలో భాగంగా ఆచార్య ఇనాక్ రచించిన 14 నవలలను ఎంపిక చేసుకుని సమగ్రంగా అధ్యయనం చేశారు. ఇనాక్ జీవిత విశేషాలతో పాటు నవలల ఇతివృత్తాలు, పాత్రల చిత్రణ, కథాకథన శైలి, సామాజిక, భాషా అంశాలను విశ్లేషించారు. ఇనాక్ నవలల్లో ప్రతిబింబించిన దళిత జీవితాలు, కుల వివక్ష, సామాజిక అసమానతలు, స్త్రీల సంఘర్షణలు, ఆత్మగౌరవం, సామాజిక న్యాయం, మానవీయ విలువలతో పాటు గ్రామీణ జీవన పరిస్థితులు, అణగారిన వర్గాల అనుభవాలు, శ్రమ విలువ, వలస జీవితాలు, స్త్రీ సాధికారత వంటి అంశాలను పరిశోధనలో విశ్లేషించారు.అలాగే నవలల్లోని భాషా వైవిధ్యం, ప్రాంతీయ యాసలు, స్థానిక పదజాలం, జానపద సంప్రదాయాలు, పాత్రల సంభాషణలు, కథన పద్ధతులను అధ్యయనం చేస్తూ తెలుగు నవలా సాహిత్యంలో ఇనాక్ రచనల ప్రత్యేకత, సామాజిక ప్రాసంగికతను వివరించారు. దర్శన్‌కు పీహెచ్డీ డాక్టరేట్ ను అవార్డు ప్రకటిస్తూ ఉస్మానియా విశ్వవిద్యాలయం పరీక్షల విభాగం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ నేపథ్యంలో కప్పపహాడ్ గ్రామానికి చెందిన దర్శన్ ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్డీ డాక్టరేట్ అవార్డు పొందడం పట్ల గ్రామస్థులు, మండల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. పలువురు విద్యావేత్తలు,అధ్యాపకులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థి సంఘాల నాయకులు ఆయనను అభినందించారు.















