EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత లేదు   ప్రజలు తప్పుడు ప్రచారాలను నమ్మవద్దు: జిల్లా కలెక్టర్ అంకిత్

ఈ తరం భారతం భద్రాద్రి కొత్తగూడెం / కరస్పాండెంట్/

యం డి. షఫీ యు జమ. ఫిబ్రవరి 27 :

జిల్లాలో పెట్రోల్, డీజిల్ నిల్వలు, సరఫరా పరిస్థితులపై జిల్లా కలెక్టర్ అంకిత్ సోమవారం సంబంధిత శాఖల అధికారులు,రీజినల్ మేనేజర్లు, ఏరియా మేనేజర్లతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంధన సరఫరా వ్యవస్థలో ప్రస్తుత పరిస్థితిని సమీక్షించి, క్షేత్రస్థాయిలో తీసుకోవాల్సిన చర్యలపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ జిల్లాలో పెట్రోల్, డీజిల్ సరఫరా విషయంలో ఎటువంటి సమస్యలు లేవని స్పష్టం చేశారు. అయితే కొన్ని ప్రాంతాల్లో రిటైల్ స్థాయిలో అపోహల కారణంగా అనవసర గందరగోళం ఏర్పడుతున్నట్లు గుర్తించామని తెలిపారు. ప్రజలు తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని, ముందస్తు కొనుగోళ్లు చేయకుండా అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ధాన్యం కొనుగోలు ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో వరి కోత యంత్రాలు, రవాణా లారీలు, వ్యవసాయ యంత్రాలకు ఇంధన సరఫరాలో ఎటువంటి ఆటంకాలు కలగకుండా ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా ప్రతి పెట్రోల్ బంక్‌పై క్షేత్రస్థాయి పర్యవేక్షణ పెంచాలని, తాసిల్దారులు బంకుల రికార్డులను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని ఆదేశించారు.

ఇండెంట్ బుకింగ్ విధానాన్ని ముందుగానే సమర్థవంతంగా అమలు చేయాలని, అవసరమైన చోట ముందస్తు బుకింగ్ వ్యవస్థను బలోపేతం చేయాలని తెలిపారు. అంతర్రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల ద్వారా ఇతర రాష్ట్రాల నుంచి అధిక మొత్తంలో డీజిల్ కొనుగోలు జరిగే అవకాశం ఉన్నందున అటువంటి కార్యకలాపాలు పునరావృతం కాకుండా పటిష్టమైన నిఘా వ్యవస్థ ఏర్పాటు చేయాలని సూచించారు.

సోషల్ మీడియా, యూట్యూబ్ వంటి వేదికల ద్వారా జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత ఉందని తప్పుడు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. ఇటువంటి ప్రచారాల వల్ల ప్రజల్లో భయాందోళనలు ఏర్పడి అనవసరంగా ముందస్తు కొనుగోళ్లు జరుగుతున్నాయని, జిల్లాలో ఎటువంటి కొరత లేదని స్పష్టం చేశారు.

రిటైల్ అవుట్‌లెట్ల వద్ద నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని, పౌరసరఫరాల శాఖతో పాటు సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. వ్యవసాయ, పారిశ్రామిక అవసరాల పేరుతో అధిక మొత్తంలో డీజిల్ నిల్వచేసి బ్లాక్ మార్కెటింగ్ లేదా అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లాలోని అన్ని పెట్రోల్ బంకుల స్టాక్ వివరాలను వెంటనే సమగ్ర నివేదిక రూపంలో సమర్పించాలని జిల్లా పౌరసరఫరాల అధికారి ప్రేమ్ కుమార్ ను ఆదేశించారు.

జిల్లా ఎస్పీ రోహిత్ రాజు మాట్లాడుతూ సరిహద్దు ప్రాంతాల్లో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం ద్వారా ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా జరిగే పెట్రోల్, డీజిల్ కొనుగోళ్లు మరియు రవాణాను అరికట్టవచ్చని తెలిపారు. రిటైల్ అవుట్‌లెట్లపై పౌరసరఫరాల శాఖతో కలిసి నిరంతర పర్యవేక్షణ అవసరమని అన్నారు . బ్లాక్ మార్కెట్ లేదా అక్రమ రవాణాలో పాల్గొనేవారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

Related News

Select the Topic
Scroll to Top