దాత.. సర్కారు బడికి చేయూత
ఈతరం భారతం, హనుమ కొండ జూలై 19 :
చక్కటి ఏకరూప దుస్తులు, మెడలో టై, కాళ్లకు బూట్లు ధరించి బస్సు ఎక్కుతున్న వీరంతా హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం గట్లనర్సింగాపూర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు. ఇదే గ్రామానికి చెందిన కావేరి విత్తన సంస్థ ఎం.డి. గుండవరపు భాస్కర్‌రావు తన ఊరిని దత్తత తీసుకొని మౌలిక వసతులు కల్పిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాల భవనాన్ని కార్పొరేట్ స్థాయిలో ఆధునికీకరించారు. ప్రస్తుతం ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో కలిపి 800 మందికిపైగా విద్యార్థులు చదువుతున్నారు. సమీప ఐదు కి.మీ. పరిధిలోని గ్రామాల నుంచి వచ్చే 420 మంది పిల్లల కోసం మూడు బస్సులు ఏర్పాటు చేశారు. డ్రైవర్లు, క్లీనర్ల వేతనాలు, డీజిల్ కోసం దాత భాస్కర్‌రావు ప్రతినెలా రూ.1.50 లక్షలను వెచ్చిస్తున్నారు. విద్యార్థులకు ఏటా రెండు జతల ఏకరూప దుస్తులు, బ్యాగు, బెల్టు, టై అందిస్తున్నారు. ప్రైవేటు ఉపాధ్యాయులను, ఆయాలను నియమించి, వారి వేతనాలనూ తనే చెల్లిస్తూ ఔదార్యాన్ని చాటుతున్నారు.














