EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు ఊరట

ఈతరం భారతం హైదరాబాద్ జూన్ 13

అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు ఊరట. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అంగన్వాడీ సిబ్బందికి పునర్నియామకానికి అవకాశం.మంత్రి సీతక్క చొరవతో అర్హులైన వారికి తిరిగి విధుల్లోకి వచ్చే మార్గం సుగమం.అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు రాజీనామా చేసి అనంతరం ఎన్నికల్లో ఓడిపోయిన అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల పునర్నియామక ప్రక్రియకు ప్రభుత్వం పచ్చా జెండా ఊపింది. మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి డా. దనసరి అనసూయ సీతక్క ప్రత్యేక చొరవతో ఈ అంశాన్ని ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించింది. ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగంగా ఎన్నికల్లో పోటీ చేసిన కారణంగా ఉద్యోగాలను కోల్పోయిన అంగన్వాడీ సిబ్బందికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

ప్రభుత్వ ఆదేశాల ప్రకారం గ్రామ పంచాయతీ లేదా మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు రాజీనామా చేసి, ఎన్నికల్లో విజయం సాధించని అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల అప్పీల్స్‌ను పరిశీలించనున్నారు. అయితే వారి స్థానంలో ఇప్పటికే మరో అభ్యర్థిని నియమించని సందర్భాల్లో మాత్రమే పునర్నియామకానికి అవకాశం కల్పించనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు శాఖ సెక్రటరి అనితా రామచంద్రన్ ఉత్తర్వులు జారీ చేశారు. అంగన్వాడీ వ్యవస్థను మరింత బలోపేతం చేయడంలో భాగంగా సిబ్బంది సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి సీతక్క పేర్కొన్నారు. అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు సేవలు అందించే కీలక భాగస్వాములని, వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అనేక మంది అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు ఊరట లభించనుంది. అర్హులైన వారి అభ్యర్థనలను నిబంధనల ప్రకారం త్వరితగతిన పరిశీలించి వారి పునర్ నియామకం చేపట్టనున్నారు.

Related News

Select the Topic
Scroll to Top