ఈతరం భారత హైదరాబాద్ జూలై 20
వినాయక చవితి ఉత్సవాల నేపథ్యంలో భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి నిర్వాహకులకు ఒక కీలక పిలుపునిచ్చింది. తెలంగాణవ్యాప్తంగా ఏర్పాటు చేసే అన్ని గణేశ్ మండపాల వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించి, ‘వందేమాతరం’ గీతాన్ని ఆలపించాలని సూచించింది. బంకించంద్ర చటోపాధ్యాయ రచించిన వందేమాతరం గీతం 150 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభసందర్భాన్ని పురస్కరించుకుని, సెప్టెంబర్ 17న ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా అత్యంత ఘనంగా నిర్వహించాలని సమితి స్పష్టం చేసింది.
మూసాపేట్‌లోని పుల్లారెడ్డి పాఠశాలలో సోమవారం ఉత్సవ సమితి అధ్యక్షుడు జి. రాఘవ రెడ్డి అధ్యక్షతన ఒక కీలక సమావేశం జరిగింది. ఈ భేటీకి రాష్ట్రంలోని 32 కేంద్రాల నుంచి 64 మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సమితి ప్రధాన కార్యదర్శి రావినూతల శశిధర్ మాట్లాడుతూ.. యువతలో దేశభక్తిని పెంపొందించడం, సాంస్కృతిక విలువలను అందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు.















