ఈతరం భారతం హైదరాబాద్ నవంబర్ 23:
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన వినియోగదారుల ప్రైవసీని మరింత మెరుగుపరిచేందుకు సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇన్స్టాగ్రామ్ తరహాలో ‘క్లోజ్ ఫ్రెండ్స్’ పేరుతో తీసుకొచ్చిన ఈ ఫీచర్ ద్వారా మన వాట్సాప్ స్టేటస్‌ను అందరికీ కాకుండా కేవలం సన్నిహిత స్నేహితులు, కుటుంబ సభ్యులకు మాత్రమే చూపించే అవకాశం కల్పించింది.సాధారణంగా మనం పెట్టే ప్రతి వాట్సాప్ స్టేటస్ ఫోన్లో ఉన్న అన్ని కాంటాక్ట్‌లకు కనిపించాల్సిన అవసరం లేదు. కొన్ని వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు, ముఖ్యమైన విషయాలను కేవలం మనకు అత్యంత దగ్గరైన వారితో మాత్రమే పంచుకోవాలని చాలామంది కోరుకుంటారు. అలాంటి వారి అవసరాలను దృష్టిలో పెట్టుకుని వాట్సాప్ ఈ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది.
*ప్రత్యేకంగా క్లోజ్ ఫ్రెండ్స్ జాబితా.. !
ఈ ఫీచర్ ద్వారా వినియోగదారులు తమకు అత్యంత సన్నిహితులైన స్నేహితులు, కుటుంబ సభ్యులతో ప్రత్యేక జాబితాను రూపొందించుకోవచ్చు. స్టేటస్ పోస్ట్ చేసే సమయంలో ఆ అప్డేట్ను అందరు కాంటాక్ట్‌లకు చూపించాలా.. ? లేక కేవలం క్లోజ్ ఫ్రెండ్స్ జాబితాలో ఉన్నవారికే చూపించాలా.. ? అనేది సులభంగా ఎంపిక చేసుకోవచ్చు.
*జాబితాలో ఎప్పుడైనా మార్పులు చేసుకోవచ్చు..!
ఈ ప్రత్యేక జాబితాలో ఎప్పుడైనా కొత్త వ్యక్తులను చేర్చుకోవచ్చు. అలాగే ఇప్పటికే ఉన్నవారిని తొలగించుకోవచ్చు. ఇందులో అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. జాబితాలో మీరు చేసే మార్పుల గురించి ఎవరికీ ఎలాంటి నోటిఫికేషన్ వెళ్లదు. ఒకరిని జాబితాలో చేర్చినా, తొలగించినా ఆ విషయం వారికి తెలియదు.
ఊదా రంగు వలయంతో ప్రత్యేక గుర్తింపు.. !
క్లోజ్ ఫ్రెండ్స్ కోసం పెట్టిన స్టేటస్ ప్రత్యేకంగా ఊదా రంగు వలయంతో కనిపిస్తుంది. దీనివల్ల సాధారణ స్టేటస్‌కు, క్లోజ్ ఫ్రెండ్స్ స్టేటస్‌కు మధ్య తేడాను సులభంగా గుర్తించవచ్చు.
*ఎవరికి ఉపయోగం.. ?
స్నేహితులు, కుటుంబ సభ్యులు, ఆఫీసు సహోద్యోగులతో వేర్వేరు విషయాలను పంచుకునే వారికి ఈ ఫీచర్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ప్రతి స్టేటస్‌ను అందరికీ చూపించకుండా, మనకు నచ్చిన వ్యక్తులతో మాత్రమే పంచుకునే వెసులుబాటు కలుగుతుంది.
మొత్తానికి వాట్సాప్ తీసుకొచ్చిన ఈ కొత్త క్లోజ్ ఫ్రెండ్స్ ఫీచర్ వ్యక్తిగత గోప్యతకు మరింత ప్రాధాన్యతనిస్తూ వినియోగదారులకు కొత్త అనుభూతిని అందించనుంది.















