ఈతరం భారతం హైదరాబాద్ జూన్ 11
కల్వకుంట్ల కవిత పెట్టిన టీఆర్ఎస్ పార్టీ పేరు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఆ పేరును దక్కించుకోవడం కోసం చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారు. టీఆర్ఎస్ పేరుపై ఏకంగా 700 అభ్యంతరాలు వెల్లువెత్తడం గమనార్హం. అయితే కవిత కంటే ముందు తానే టీఆర్ఎస్ పార్టీ పేరును నమోదు చేసుకున్నట్లు మహారాష్ట్రకు చెందిన నేత ఇప్పుడు రంగంలోకి దిగారు. దీంతో ఇప్పుడు కవిత పార్టీ పేరు ఉంటుందా లేదా అనేది తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
టీఆర్ఎస్ పార్టీ పేరుకు సంబంధించి.. వివాదం రోజురోజుకూ ముదురుతోంది. ఇప్పటికే కవిత ప్రతిపాదించిన తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్) పేరును కాస్తా కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణ రక్షణ సేనగా మార్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ టీఆర్ఎస్ పేరు మీద అభ్యంతరాలు చెప్పాలంటూ ఇచ్చిన ప్రకటనపై వందల కొద్ది అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక టీఆర్ఎస్ పేరును తామే ముందు రిజిస్టర్ చేసుకున్నట్లు మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తి ఇప్పుడు ఈసీని ఆశ్రయించడం గమనార్హం.
ఏప్రిల్ 25వ తేదీన పార్టీ ఆవిర్భావ కార్యక్రమం సందర్భంగా తన పార్టీ పేరు టీఆర్ఎస్ అని ప్రకటించిన సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్) అంటూ ప్రకటించారు. ఆ తర్వాత కొన్నిరోజులకే ఎన్నికల సంఘం తెలంగాణ రక్షణ సేన పేరుకు ఆమోదం కల్పించింది. పార్టీ పేరు మారినా.. దానికి షార్ట్‌కట్ టీఆర్ఎస్ రావడంతో కవిత సంతోషంలోనే ఉన్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ పేరుపై మరోసారి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో.. కవిత కొత్త పార్టీకి టీఆర్ఎస్ అనే పేరు కొనసాగుతుందా లేదా అనేది సర్వత్రా ఉత్కంఠగా మారింది.మరోవైపు.. కవిత పార్టీకి టీఆర్ఎస్ పేరు పెట్టడంపై భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) హైకమాండ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘానికి అధికారికంగా ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
14 ఏళ్ల పాటు సుదీర్ఘంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేసిన ఉద్యమంలో టీఆర్ఎస్ (తెలంగాణ రాష్ట్ర సమితి) అనే పేరు తెలంగాణ ప్రజల ఎమోషన్స్‌తో అల్లుకుపోయిందని బీఆర్ఎస్ పార్టీ తెలిపింది. ఇప్పటికీ గ్రామాల్లో ప్రజలు బీఆర్ఎస్ పార్టీని టీఆర్ఎస్ పార్టీగానే గుర్తిస్తున్నారని.. ఇప్పుడు అదే పేరుతో ఇంకో కొత్త పార్టీకి ఆమోదం ఇస్తే.. ప్రజలు తీవ్ర గందరగోళానికి గురయ్యే ప్రమాదం ఉందని బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ వాదించింది.















