ఈతరం భారతం హైదరాబాద్ మే 2
అల్లాదుర్గం మండలం గడి పెద్దాపూర్ లో మల్లికార్జున స్వామి జాతర ఉత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా కన్నుల పండుగ జరుగుతున్నాయి. జాతర ఉత్సవాల్లో భాగంగా శనివారం జాతర ప్రధాన ఘట్టమైన ఎడ్లబండ్ల ప్రదక్షణ భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆయా గ్రామాల నుండి వచ్చిన భక్తులు అందంగా అలంకరించిన తమ ఎడ్లబండ్లతో మల్లికార్జున స్వామి ఆలయం వరకు చేరుకొని జాతర ఉత్సవాల్లో భాగంగా ఆలయం చుట్టూరా బండ్ల ప్రదక్షిణ లు చేయించారు.
జాతరను పురస్కరించుకొని శనివారం గడి పెద్దాపూర్ తో పాటు ముస్లాపూర్,దాదాయపల్లి, బర్దిపూర్,బహిరన్ దిబ్బ,పోతుల బొగుడ,బిజిలి పూర్, కే రూల్,రంసాన్ పల్లి, ఎర్రారం తదితర గ్రామాల నుండి వచ్చిన భక్తులతో మల్లికార్జున స్వామి ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు మల్లికార్జున స్వామి వారి దర్శనం కోసం గంటల తరబడి క్యూ లైన్ లో వేచి ఉండాల్సి వచ్చింది. అయితే స్థానిక ప్రజలతోపాటు సుదూర ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు జాతర వరకు చేరుకొని స్వామివారిని దర్శించుకుని తమ మొక్కులను చెల్లించుకున్నారు.
దీంతో ఎక్కడ చూసినా భక్తుల సందడి నెలకొంది. ఈ సందర్భంగా పలు ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు మల్లికార్జున స్వామికి ఒడిబియ్యం, కుంకుమార్చనలు సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఇందులో భాగంగా ఆలయ అర్చకులు చంద్రయ్య ప్రత్యేక పూజలు నిర్వహించగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ అన్ని సౌకర్యాలు చేసింది. జాతర ఉత్సవాలు ప్రశాంతంగా ముగిసేలా అల్లాదుర్గం సిఐ రేణుక రెడ్డి,అల్లాదుర్గం ఎస్సై శంకర్ ఆధ్వర్యంలో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.















